Supernovas: ఫైనల్ పంచ్ సూపర్ నోవాస్‌దే.. మహిళల టీ20 చాలెంజ్ విజేతగా హర్మన్‌ప్రీత్ జట్టు

Supernovas overcome Wolvaardt and Simran scare to lift title
  • నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన సూపర్ నోవాస్
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రెండూ డాటిన్‌కే
  • లారా అర్ధ సెంచరీ వృథా
మహిళల టీ20 చాలెంజ్ విజేతగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టు అవతరించింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గత రాత్రి దీప్తిశర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన సూపర్ నోవాస్ కప్పు ఎగరేసుకుపోయింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్  చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డియేండ్ర డాటిన్ 44 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (62) చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 29 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియా పూనియా 28 పరుగులు చేసింది. పూనియా-డాటిన్ కలిసి తొలి వికెట్‌కు 73 పరుగులు, డాటిన్-హర్మన్‌ప్రీత్ కలిసి రెండో వికెట్‌కు 58 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో సూపర్ నోవాస్ ఇన్నింగ్స్ 165 పరుగుల వద్ద ముగిసింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్, దీప్తిశర్మ, సిమ్రన్ బహదూర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

అనంతరం 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెలాసిటీ 20 ఓవర్లలో 161 పరుగులు మాత్రమే చేసి విజయానికి 5 పరుగుల ముందు చతికిలపడింది. బ్యాటర్లు అందరూ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరుతున్నప్పటికీ క్రీజులో పాతుకుపోయిన లారా వోల్వార్ట్ జట్టును విజయం దిశగా ముందుకు నడిపింది. అయితే, సహచరుల నుంచి సరైన మద్దతు లేకపోవడంతో పరాజయం తప్పలేదు. 

లారా 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 65 పరుగులు చేసింది. చివర్లో సిమ్రన్ 10 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు పిండుకుని గెలుపై ఆశలు రేపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. షెఫాలీ వర్మ 15, యస్తికా భాటియా 13, స్నేహ్ రాణా 13 పరుగులు చేశారు. సూపర్ నోవాస్ బౌలర్లలో అలనా కింగ్ మూడు వికెట్లు పడగొట్టగా, సోఫియా, డియేండ్ర డాటిన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, టోర్నీ ఆద్యంతం చక్కని ప్రదర్శన కనబర్చిన డియేండ్ర డాటిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా లభించింది.
Supernovas
Velocity
Womens T20 Challenge 2022
Deandra Dottin

More Telugu News