అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!

28-05-2022 Sat 22:13
  • అంపైరింగ్ లో లెజెండ్ గా గుర్తింపు పొందిన టౌఫెల్
  • సెహ్వాగ్ కు మంచి అవగాహన ఉందని వెల్లడి
  • అంపైరింగ్ కు నో చెప్పాడని వివరణ
  • కోహ్లీ, అశ్విన్ కు మంచి అవగాహన ఉందని కితాబు
When Taufel invites Sehwag into umpiring career
క్రికెట్ ప్రపంచంలో ఎంతోమంది అంపైర్లు ఉన్నా, వారందరిలోకి ఆస్ట్రేలియా అంపైరింగ్ దిగ్గజం సైమన్ టౌఫెల్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఎంతో ఒత్తిడితో కూడుకున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో ఎంతో సౌమ్యంగా, హుందాగా నడుచుకుంటూ, ఎవరినీ నొప్పించని రీతిలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించడం టౌఫెల్ కే చెల్లింది. టౌఫెల్ కొంతకాలం కిందట అంపైరింగ్ కు వీడ్కోలు పలికారు. ఇటీవల ఓ క్రీడా చానల్ తో టౌఫెల్ ఆసక్తికర అంశం వెల్లడించారు. 

భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్ కాకముందు, ఫీల్డింగ్ సమయంలో స్క్వేర్ లెగ్ లో నిలుచునేవాడని వెల్లడించారు. ఆ సమయంలో తాను లెగ్ అంపైర్ గా ఉన్నప్పుడు, తన పక్కనే ఫీల్డింగ్ చేస్తుండే సెహ్వాగ్ ఇది అవుట్, ఇది నాటౌట్ అని చెబుతుండేవాడని గుర్తు చేసుకున్నారు. దాంతో, క్రికెట్ నుంచి తప్పుకున్నాక అంపైర్ గా అవతారం ఎత్తొచ్చు కదా? అని సలహా ఇచ్చానని, అయితే సెహ్వాగ్ అందుకు అంగీకరించలేదని టౌఫెల్ తెలిపారు. అంపైరింగ్ అంటే తనకిష్టం లేదని చెప్పాడని వివరించారు. 

అంపైరింగ్ రంగంపై ఆసక్తి చూపించే దక్షిణాఫ్రికా బౌలర్ మోర్నీ మోర్కెల్ తదితర ఆటగాళ్లతోనూ తాను మాట్లాడానని, కానీ అందరూ అంపైర్లు కాలేరని టౌఫెల్ స్పష్టం చేశారు. తన వరకు సెహ్వాగ్ అంపైర్ గా మైదానంలో అడుగుపెడితే చూడాలని ఉందని మనసులో మాట వెల్లడించారు. అంతేకాదు, భారత జట్టులో విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లకు కూడా ఆట నియమనిబంధనలు, పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని, వారిద్దరు కూడా అంపైరింగ్ రంగంలోకి రావొచ్చని టౌఫెల్ ఆహ్వానం పలికారు.