IPL-15: ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!

  • రేపటితో ముగియనున్న ఐపీఎల్-15
  • గుజరాత్ వర్సెస్ రాజస్థాన్
  • రెండు బలమైన జట్లే!
  • ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశం
All set for IPL final

గత రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 15వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. 

ఈ సీజన్ ద్వారానే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో సాధికారికంగా ఆడి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. క్వాలిఫయర్-1లోనూ అదే తరహా ఆటతీరు కనబరిచి రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి నేరుగా ఫైనల్స్ చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో బెంగళూరును ఓడించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ రెండు జట్లు మరోసారి పోటీపడుతుండడంతో విజేత ఎవరన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

ఇరుజట్లలోనూ బ్యాట్స్ మెన్ భీకర ఫామ్ లో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుండి నడిపిస్తుండగా, డేవిడ్ మిల్లర్ ప్రతి మ్యాచ్ కు మెరుగవుతున్నాడు. ఇక సాహా, తెవాటియా కూడా బ్యాట్ తో సత్తా చాటుతుండడం గుజరాత్ కు కలిసొచ్చే అంశం. 

అటు, రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 4 సెంచరీలు సాధించిన బట్లర్... ఫైనల్స్ లోనూ చెలరేగితే గుజరాత్ బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. బట్లర్ మాత్రమే కాదు, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మిడిలార్డర్ లో హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్ కూడా రాణిస్తున్నారు. 

బౌలింగ్ చూస్తే... గుజరాత్ జట్టులో షమీ, రషీద్ ఖాన్ కీలకం కానున్నారు. రషీద్ ఖాన్ బంతితోనే కాదు, బ్యాట్ తోనూ రాణించే సత్తా ఉన్నవాడే. ఫైనల్లో తన ట్రేడ్ మార్కు స్నేక్ షాట్ ఆడతానని రషీద్ ధీమాగా చెబుతున్నాడు. 

రాజస్థాన్ బౌలింగ్ చూస్తే... ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చహల్, ఒబెద్ మెక్ కాయ్, రవిచంద్రన్ అశ్విన్ లతో పటిష్ఠంగా ఉంది. ఏదేమైనా రెండు బలమైన జట్ల మధ్య ఐపీఎల్ టైటిల్ పోరు జరగనుండడం క్రికెట్ అభిమానులకు వినోదం హై రేంజిలో లభించనుంది.

More Telugu News