ఈ సభ చూస్తే జగన్ కు పిచ్చెక్కడం ఖాయం: చంద్రబాబు

28-05-2022 Sat 20:14
  • ఒంగోలులో టీడీపీ మహానాడు
  • భారీ ఎత్తున ముగింపు సభ
  • ఉద్వేగభరితంగా ప్రసంగించిన చంద్రబాబు
  • సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు
Chandrababu speech at Ongole rally
తెలుగుదేశం పార్టీ రెండ్రోజులుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు నేటితో ముగిసింది. ముగింపు సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగించారు. తాను కొన్ని వందల సభల్లో పాల్గొన్నానని, కానీ ఇంత చైతన్యం కనిపించిన సభ ఇదొక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సభ ద్వారా వైసీపీతో యుద్ధం మొదలైందని సమరశంఖం పూరించారు. ఎంతో పట్టుదలతో, ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని కార్యకర్తలు ముందుకొచ్చారని, సోదరసోదరీమణులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని కొనియాడారు. 

ఈ యుద్ధంలో వైసీపీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, తాడోపేడో తేల్చుకోవడానికి మీరంతా ముందుకొచ్చారని అభినందించారు. ఈ జనాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. 

"ఒంగోలు మహానాడుకు లక్షలాదిగా తరలివచ్చారు. టీడీపీ కార్యకర్తలను రాకుండా చేసేందుకు వాహనాలను అడ్డుకున్నారు. డబ్బులు కడతాం అని చెప్పినా బస్సులు ఇవ్వలేదు, ప్రైవేటు వాహనాలు ఇవ్వలేదు. మనకు వాళ్లకు ఒకటే తేడా... మనకు జనాలు ఉన్నారు, వాళ్లకు బస్సులు ఉన్నాయి. అధికారం పోతే ఆ బస్సులు కూడా ఉండవు. 

ఇక్కడ కూడా చూశాను.. ఒక పోలీసు అమితమైన ఉత్సాహం ప్రదర్శించాడు. మనవాళ్లు కారులో ఇక్కడికి వస్తే ఆ పోలీసు కారు టైరు గాలి తీశాడు. పోలీసులూ జాగ్రత్తగా ఉండండి... నేను మీ గాలి కూడా తీస్తా. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా నేను ఏం నేర్పించానో పోలీసులు ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఈ సభలో ఒక్క పోలీసు అయినా ఉన్నారా? మా లా అండ్ ఆర్డర్ మేం చూసుకుంటాం. మాకు అడ్డు రాకండి. పోలీసులు అదుపుతప్పితే వారిని కూడా నియంత్రించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. 

ఇవాళ ఒక యుగ పురుషుడు పుట్టినరోజు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక వంటి మహానుభావుడికి మనం వారసులం... మనం భయపడతామా? మనలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంది. కొండనైనా ఢీకొడతాం. ఇవాళ జగన్ కు పిచ్చెక్కుతుంది... మహానాడుకు వస్తున్న స్పందన చూస్తే నిద్ర కూడా రాదు. బస్సులు నిలిపేస్తే మనకు మనుషులు రారనుకున్నాడు... ఇబ్బందులు కలిగిస్తే భయపడతామనుకున్నాడు. బస్సు యాత్ర పెడితే ఈయనను ప్రజలు నమ్ముతారని అనుకున్నాడు. కానీ వాళ్ల మీటింగులు వెలవెల... మన మీటింగులు కళకళ! వాళ్లకు బస్సులు ఉంటే మనకు ప్రజలు ఉన్నారు. 

ఎన్టీఆర్ వంటి యుగ పురుషుడు మళ్లీ పుట్టడు. ఆయన రికార్డులను ఎవరూ బద్దలు కొట్టలేరు. అందుకే ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఆశయాలను రాష్ట్రమంతా తీసుకెళ్లాలి. దీనికోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాలో మినీ మహానాడు జరుపుతాం. 

మొన్న బాలయ్య నటించిన అఖండ చిత్రం వచ్చింది. ఏపీలో దానిపై ఆంక్షలు విధించారు. బాలకృష్ణ చిత్రం ఆడకూడదని, స్పెషల్ షోలు కూడా ఇవ్వలేదు. కానీ, బాలయ్య ప్రజలపై నమ్మకంతో అఖండ చిత్రం రిలీజ్ చేశాడు. ఆ సినిమా ఎలా ఆడింది... అదీ బాలకృష్ణ అంటే. ఒక ఉన్మాది... చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి సినిమా వాళ్లను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. సినిమా వాళ్లకు నువ్వు పర్మిషన్లు ఇస్తావా? జగన్... అలాగైతే రేపు నీ పేపర్ కు కూడా నేనే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నీ టీవీ చానల్ ఎలా నడుపుతావ్? నీ భారతి సిమెంట్ ఎలా నడుపుతావ్?

ఏదైనా కొన్ని విలువలతో రాజకీయం చేస్తే శాశ్వతంగా ఉంటుంది కానీ, తప్పుడు రాజకీయాలు చేస్తే అది శాశ్వతం కాదు. మనం బాదుడే బాదుడు మొదలుపెడితే... వీళ్లు వెంటవెంటనే గడపగడపకు మన ప్రభుత్వం అని మొదలుపెట్టారు. ప్రజలు నిలదీయడంతో బస్సు యాత్ర పెట్టారు. అది కూడా అయిన తర్వాత గాలి యాత్ర పెట్టి, గాల్లో తిరుగుతారు. 

ఈ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచింది... పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు, వంటగ్యాస్ ధర పెంచారు... ఇది మామూలు బాదుడు కాదు వీరబాదుడు. టీడీపీ ప్రభుత్వంలో మేం పెంచామా? ఆఖరికి టమాటాలు, చికెన్ రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఏపీ కూడా శ్రీలంక బాటలోనే పయనించడం ఖాయం. మేం ప్రజల కోసం పోరాడితే వైసీపీ నేతలు మాపై దాడులు చేస్తున్నారు. జగన్ కేసులు పెట్టాలని అనుకుంటున్నాడు... పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటావో... అన్నింటికి రాటుదేలిపోయాం. ఆ రోజు నేను కూడా ఇదే రీతిలో ఆలోచించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడా?

నేను ప్రజాస్వామ్యవాదిని. తీవ్రవాదాన్ని, రౌడీయిజాన్ని, అరాచకాలను అదుపుచేసి, రౌడీల గుండెల్లో నిద్రపోయిన పార్టీ టీడీపీ. ఇప్పుడు నేరస్తులు వచ్చారు. వీళ్లని వదిలేది లేదు. పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. టీడీపీ హయాంలో ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేశాం. అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరు? విదేశీ విద్య ఇచ్చింది ఎవరు? సంక్రాంతి కానుక ఎవరిచ్చారు? రంజాన్ తోఫా ఎవరిచ్చారు? క్రిస్మస్ గిఫ్ట్ ఎవరిచ్చారు? చంద్రన్న బీమా ఎవరిచ్చారు? నిరుద్యోగ భృతి ఇచ్చామా లేదా?... అవన్నీ ఉన్నాయా ఇప్పుడు? జగన్ ఇవన్నీ ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి. 

సంక్షేమం పేరుతో మీరు ఎంత దోపిడీ చేశారో తేలాల్సి ఉంది. ఈ సీఎం వచ్చాక రూ.8 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఆ డబ్బు ఎక్కడికి పోయింది? బాదుడే బాదుడు ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి పోయింది? ఈ కష్టాలు తట్టుకోలేక మన తమ్ముళ్లు కూడా అప్పుడప్పుడు మద్యం సేవిస్తుంటారు. కానీ మా హయాంలో ఉన్న కింగ్ ఫిషర్ బీరు ఇప్పుడు లేదు... ఇప్పుడు రాష్ట్రంలో బూమ్ బూమ్ బీరు ఉంది. ఒకప్పుడున్న మెక్ డోవెల్ ఇప్పుడుందా...? మెక్ డోవెల్ లేదు కానీ, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ ఉన్నాయి. త్వరలో ఇంజినీర్ బ్రాండ్, అడ్వొకేట్ బ్రాండ్ కూడా వస్తాయంటున్నారు. 

ఇప్పుడు జగన్ సొంత బ్రాండ్ లు తీసుకువస్తున్నాడు. రూ.9 ఉండే దాన్ని రూ.21 చేశాడు. రూ.12 జగన్ జేబులోకి పోతున్నాయి. మీరు తాగే ప్రతి ఒక్క క్వార్టర్ పై జగన్ కు రూ.12 లభిస్తాయి. సంవత్సరానికి ఈయన ఆదాయం ఎంతో తెలుసా? ఒక్క లిక్కర్ ద్వారానే రూ.5 వేల కోట్లు వస్తున్నాయి. నేనడుగుతున్నా... ఇది ఎవడబ్బ సొమ్మో జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఇసుక దొరికే పరిస్థితి ఉందా? మేం ట్రాక్టర్ ఇసుక రూ.600, రూ.700కి ఇస్తే విమర్శించిన ఈ జగన్ ట్రాక్టర్ ఆరేడు వేలకు అమ్ముతున్నాడు. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతోంది?

రాష్ట్రంలో ఖనిజ సంపద అంతా దోపిడీ చేస్తున్నారు. గనులన్నీ వీళ్లే హస్తగతం చేసుకున్నారు. బెదిరింపులు, సెటిల్మెంట్లతో ఎమ్మెల్యేలు, జగన్ దోపిడీకి పాల్పడుతున్నారు. గూగుల్ మ్యాప్ లు ఉన్నాయి... రేపు మీ అవినీతిని మొత్తం కక్కిస్తా. ఇప్పుడు మరో విషయం కూడా చెబుతున్నా... మీరు భూముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూముల విషయంలో లిటిగేషన్ పడిపోతుంది... మీ భూమి మీకు రావాలంటే చాలా సమయం పడుతుంది. మీ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే విడిపించే బాధ్యత నాది. ఈ మూడేళ్లలో జగన్ అవినీతి సొమ్ము రూ.1.75 లక్షల కోట్లు. 

జగన్ నువ్వు కుయుక్తులు పన్నవద్దు, అబద్దాలు చెప్పవద్దు... మీ ఎమ్మెల్సీ ఓ కారు డ్రైవర్ ను చంపేసి, అతడే మృతదేహాన్ని తీసుకువస్తాడు.... ఈ విషయంలో టీడీపీ పోరాడింది... వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. మా పోరాటంతో అనంతబాబును సస్పెండ్ చేశారు. ఆఖరికి బాబాయిని చంపి గొడ్డలిపోటును గుండెపోటు అన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? ఆ కేసులో సీబీఐపైనే బాంబులు వేస్తారట.. సీబీఐపై బాంబులే వేస్తే నిన్ను వదిలిపెడతారా? 

రాజధాని అమరావతిని ఏంచేశారు... నాశనం చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని ఈ వైసీపీ దుర్మార్గుడు అంటున్నాడు... నాడు ఎన్టీఆర్ రైతుల మోటార్లకు మీటర్లు తీసేశాడు. ఇప్పుడు రైతుల జీవితాలు నాశనం అయ్యాయి. దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు... రైతులకు టీడీపీ అండగా ఉంటుంది" అని  ఉద్ఘాటించారు.