ఎన్టీఆర్‌ను స్మ‌రించుకున్న టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్

28-05-2022 Sat 19:31
  • 1988 మే 20న మియాపూర్‌లో బ‌స్ బాడీ బిల్డింగ్‌కు ఎన్టీఆర్ పునాది
  • ఈ కార్య‌క్రమానికి ఆర్టీసీ బ‌స్సులోనే వెళ్లిన ఎన్టీఆర్‌
  • ఈ వివ‌రాల‌తో సజ్జనార్ ట్వీట్‌
tsrtc md sajjannar tweet on ntr
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉమ్మ‌డి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన నంద‌మూరి తార‌క రామారావును సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్సార్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ స్మ‌రించుకున్నారు. ఈ మేర‌కు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని శ‌నివారం ఆర్టీసీకి ఎన్టీఆర్ చేసిన సేవ‌ల‌ను కీర్తిస్తూ సజ్జనార్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 
తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో 1988 మే 20న‌ రాష్ట్ర సీఎం హోదాలో హైద‌రాబాద్‌లోని మియాపూర్ వ‌ద్ద ఆర్టీసీ బ‌స్ బాడీ బిల్డింగ్ కేంద్రం నిర్మాణానికి ఎన్టీఆర్ పునాది వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫ‌ల‌కం ఫొటోను త‌న ట్వీట్‌కు జ‌త చేసిన సజ్జనార్.. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్టీసీ బ‌స్సులోనే ఎన్టీఆర్ ప్ర‌యాణించిన విష‌యాన్ని వెల్ల‌డించారు.