మహేశ్ తో తలపడే విలన్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!

28-05-2022 Sat 18:46
  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు
  • త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో మూడో సినిమా 
  • జులై నుంచి సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న తారకరత్న   
Trivikram and Mahesh Babu movie update
మహేశ్ బాబు ఇప్పుడు తన 28వ సినిమాపై దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. దాంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడం వలన, ఆ రోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలే ఛాన్స్ ఉందని అంటున్నారు. జులైలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఈ సినిమాలో విలన్ గా తారకరత్న పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంత అనే సందేహం అందరిలోనూ ఉంది. ఆ సందేహాలకు తెర దించుతూ తారకరత్న తాను మహేశ్ 28వ సినిమాలో చేయనున్నట్టు ఒక ట్వీట్ చేశాడు. విలనిజానికి సంబంధించిన ఒక ఎమోజీని జోడించాడు. గతంలో విలన్ పాత్రలు చేసిన అనుభవం తారకరత్నకు ఉంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్రను ఎలా డిజైన్ చేశారనేది చూడాలి.