Nara Lokesh: రాముడు ఉన్నప్పుడు రాక్షసుడు కూడా ఉంటాడు... ఆ రాక్షసుడే జగన్: నారా లోకేశ్

Lokesh terms Chandrababu as Lord Rama and CM Jagan as monster
  • మహానాడులో లోకేశ్ ప్రసంగం
  • బొంగురుపోయిన లోకేశ్ గొంతు
  • అయినా కార్యకర్తల కోసం మాట్లాడిన లోకేశ్
  • సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన యువనేత
ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగించారు. పసుసుజెండాను మోస్తున్న కార్యకర్తలందరికీ పాదాభివందనం అంటూ ప్రసంగం ప్రారంభించారు. మహానాడుకు లక్షలాది కార్యకర్తలు తరలి వచ్చారని వెల్లడించారు. మనది పసుపు జెండా. మన శరీరం కోస్తే పసుపు రంగే వస్తుంది అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. 

"అయ్యా జగన్... నువ్వు బస్సులను ఆపగలుగుతావ్... మా కార్ల టైర్లలో గాలి తీయగలుగుతావ్... కానీ టీడీపీ కార్యకర్తలను మాత్రం ఆపలేవని ఈ సభాముఖంగా చెబుతున్నాను. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పునాదులు ఇప్పటికీ గట్టిగానే ఉన్నాయి. టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వాళ్లే గాలికి కొట్టుకుపోయారు" అని తెలిపారు.

శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయిన ఘనత జగన్ కే దక్కుతుందని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ అంటే ఏంటో తెలుసా... యువజన శృంగార, రౌడీ కాంగ్రెస్ పార్టీ అని లోకేశ్ అన్నారు.  

"మన నాయకుడు చంద్రబాబు రాముడులాంటి వ్యక్తి. ఆయన పాలించిన 14 ఏళ్లలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టలేదు. ఏనాడూ ధరలు పెంచలేదు, ఏనాడూ ఆర్టీసీ చార్జీలు పెంచలేదు, ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచలేదు. హెచ్ సీఎల్, ఫాక్స్ కాన్, అపోలో టైర్స్, కియా మోటార్స్ వంటి పరిశ్రమలను తీసుకువచ్చి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ లా నిలిచిన వ్యక్తి మన రాముడు చంద్రబాబు. 

రాముడు ఉన్నప్పుడు రాక్షసుడు కూడా ఉంటాడు... ఆ రాక్షసుడే ఈ జగన్ మోహన్ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జేసీబీ పాలన కొనసాగుతోంది. ప్రజావేదిక కూల్చి, అక్కడి నుంచి ప్రజలపై పడ్డాడు. కులాలు, ప్రాంతాల మధ్య ఈ రాక్షసుడు జగన్ చిచ్చుపెడుతున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చీప్ లిక్కర్ కు కూడా ఈ రాక్షసుడు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. 

ధరలు పెంచడంలో నెంబర్ వన్ అయ్యాడు. పెట్రోల్ ధరల్లో నెంబర్ వన్, డీజిల్ ధరలు నెంబర్ వన్, చెత్తపై పన్నుల్లో నెంబర్ వన్, ఆర్టీసీ చార్జీల్లో నెంబర్ వన్, ఇసుక ధరల్లో నెంబర్ వన్ గా అయ్యాడు. కానీ చంద్రబాబు అన్న క్యాంటీన్లు, పెళ్లికానుక, విదేశీ విద్య వంటి కార్యక్రమాలకు మన రాముడు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు. కానీ ఈ రాక్షసుడు జగన్ కోడికత్తి, బాత్రూంలో బాబాయి, మూడు రాజధానుల అంశాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలాడు. 

రాముడు కన్ స్ట్రక్షన్ చేస్తే ఈ రాక్షసుడు డిస్ట్రక్షన్ చేస్తున్నాడు. మన రాముడికి ముందు చూపు ఉంటే ఆ రాక్షసుడుకి మందు చూపు ఉంది. అవ్వా తాతా అక్కా చెల్లీ అంటూ ఒక్క చాన్స్ అడిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి రాక్షసుడు కన్నతల్లిని, చెల్లిని, యువతను మోసం చేశాడు. అన్నగా స్పీడ్ గా వస్తానని చెప్పి ఆడబిడ్డలను కూడా మోసం చేశాడు" అంటూ లోకేశ్ నిప్పులు చెరిగారు. 

కాగా, నిన్నటి నుంచి వరుస ప్రసంగాలతో లోకేశ్ గొంతు బొంగురుపోయింది. అయితే కార్యకర్తల్లో మరింత స్ఫూర్తి రగిల్చేందుకు లోకేశ్ బొంగురు గొంతుతోనే ప్రసంగించారు. ఓ దశలో కార్యకర్తలు మరింత ముందుకు తోసుకురావడంతో లోకేశ్ ప్రసంగం ఆపేశారు. దాంతో చంద్రబాబు మైక్ అందుకున్నారు.
Nara Lokesh
Chandrababu
Lord Rama
Jagan
Monster
TDP Mahanadu

More Telugu News