Somireddy Chandra Mohan Reddy: నారా లోకేశ్‌తో కైవ‌ల్యా రెడ్డి భేటీపై సోమిరెడ్డి స్పంద‌న ఇదే

tdp leader somireddy responds on nara lokesh and kaivalya reddy meeting
  • కైవ‌ల్యా రెడ్డి ముమ్మాటికీ టీడీపీ కుటుంబ స‌భ్యురాలన్న సోమిరెడ్డి 
  • ఆమె భ‌ర్త రితేశ్ రెడ్డి బ‌ద్వేల్ టీడీపీ మ‌హిళా నేత విజ‌య‌మ్మ కుమారుడని వివరణ 
  • రాష్ట్రం కోసం పార్టీలోకి ఎవ‌రు వ‌చ్చినా స్వాగ‌తిస్తామ‌న్న సోమిరెడ్డి
నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కుమార్తె కైవ‌ల్యా రెడ్డి శ‌నివారం ఒంగోలులో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఆత్మ‌కూరు ఉప ఎన్నికలో టీడీపీ టికెట్‌ను అడిగేందుకే ఆమె లోకేశ్‌తో భేటీ అయ్యార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి టీడీపీ కీల‌క నేత‌గా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఈ భేటీపై తాజాగా స్పందించారు. 

కైవ‌ల్యా రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూతురే అయినా... క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌కవ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత వీరారెడ్డి మ‌న‌వ‌డు, అక్క‌డ టీడీపీ మ‌హిళా నేత‌గా కొన‌సాగుతున్న విజ‌య‌మ్మ కుమారుడు రితేశ్ రెడ్డిని వివాహ‌మాడార‌ని సోమిరెడ్డి చెప్పారు. ఈ లెక్క‌న కైవ‌ల్యా రెడ్డి వైసీపీకి చెందిన నేత ఎంత‌మాత్రం కాద‌ని, ఆమె ముమ్మాటికీ టీడీపీ కుటుంబానికి చెందిన మ‌హిళేన‌ని స్పష్టం చేశారు. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో టీడీపీ టికెట్‌ను ఆమె లోకేశ్‌ను అడిగారో, లేదో త‌న‌కు తెలియ‌ద‌న్న సోమిరెడ్డి.. టికెట్ల కేటాయింపుపై ఇప్పుడే చ‌ర్చ ఉండ‌ద‌ని చెప్పారు. రాష్ట్రం కోసం పార్టీలోకి ఎవ‌రు వ‌చ్చినా స్వాగ‌తిస్తామ‌ని సోమిరెడ్డి తెలిపారు.
Somireddy Chandra Mohan Reddy
Anam Ramanarayana Reddy
TDP
YSRCP
Nara Lokesh
Kaivalya Reddy
Kadapa District
Badvel

More Telugu News