గుంటూరు ఎన్టీఆర్ బ‌స్టాండ్ కూడ‌లిలో అన్న క్యాంటీన్ ప్రారంభం

28-05-2022 Sat 16:18
  • నేడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు
  • టీడీపీ ఎన్నారై, బాల‌కృష్ణ అభిమానుల ఆర్థిక సాయం
  • అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన న‌క్కా ఆనంద‌బాబు, తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌
tdp leaders opens anna canteen at guntur ntr bustand center
టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ వ్యాప్తంగా వెల‌సిన అన్న క్యాంటీన్లు వైసీపీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత మూత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ పేరిట పెట్టిన ఈ క్యాంటీన్లు వ‌లం రూ.5కే భోజ‌నం అందించాయి. తాజాగా అన్న క్యాంటీన్ పేరిట గుంటూరులో ఓ క్యాంటీన్ శ‌నివారం ప్రారంభ‌మైంది. టీడీపీ మాజీ మంత్రి న‌క్కా ఆనంద‌బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌లు ఈ క్యాంటీన్‌ను గుంటూరులోని ఎన్టీఆర్ బ‌స్టాండ్ కూడ‌లిలో ప్రారంభించారు.

టీడీపీ ఎన్నారై విభాగం, నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు అందించిన ఆర్థిక సాయంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. గ‌తంలో అన్న క్యాంటీన్‌లో మాదిరే ఈ క్యాంటీన్‌లోనూ రూ.5ల‌కే భోజ‌నాన్ని అందించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఈ క్యాంటీన్‌ను ప్రారంభించిన‌ట్లు వారు తెలిపారు.