తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తి ఎన్టీఆర్: పవన్ కల్యాణ్

28-05-2022 Sat 13:59
  • శతజయంతి సందర్భంగా జనసేనాని నివాళులు
  • బడుగులకు రాజకీయ అవకాశాలిచ్చిన అభ్యుదయ వాది అని ప్రశంస
  • తెలుగు భాష కీర్తి ప్రతిష్ఠలను దేశవ్యాప్తం చేశారని కితాబు 
NTR Is A Great Political Person Says Pawan Kalyan
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయనకు జనసేనాని పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. తెలుగుగడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని కొనియాడారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజుల్లో ఓ రాజకీయపార్టీని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన అభ్యుదయ వాది ఎన్టీఆర్ అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి శతజయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానన్నారు. 

తెలుగు భాషపై ఆయనకున్న మక్కువ, పట్టు తననెంతగానో ఆకట్టుకునేవని పవన్ పేర్కొన్నారు. తెలుగు భాష కీర్తి ప్రతిష్ఠలను దేశ నలుమూలలకు వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, అలాంటి నేత శతజయంతి సందర్భంగా తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున అంజలి ఘటిస్తున్నట్టు పేర్కొన్నారు.