తెలంగాణ పోలీసు నియామ‌కాల‌కు ముగిసిన ద‌ర‌ఖాస్తు గ‌డువు... ఎన్ని ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయంటే..!

27-05-2022 Fri 18:53
  • 16,614 పోస్టుల భర్తీకి ఇటీవ‌లే నోటిఫికేషన్ జారీ
  • ఖాళీల్లో 16,027 కానిస్టేబుల్ పోస్టులు, 587 ఎస్‌ఐ పోస్టులు
  • 7.33 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల నుంచి 12.91 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు
  • ఎస్సై పోస్టులకు 2.47 ల‌క్ష‌లు, కానిస్టేబుల్ పోస్టుల‌కు 9.50 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు
  • ద‌ర‌ఖాస్తుదారుల్లో 2.76 ల‌క్ష‌ల మంది మ‌హిళా అభ్య‌ర్థులు
nearly 13 lacks of applications for 16614 police posts in telangana
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల గ‌డువు గురువారం రాత్రితో ముగిసింది. తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 16,614 పోస్టుల భర్తీకి ఇటీవ‌లే నోటిఫికేషన్ జారీ అయిన సంగ‌తి తెలిసిందే. ఖాళీల్లో 16,027 కానిస్టేబుల్ పోస్టులు, 587 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసేలోగా 7.33 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు.. 12.91 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించారు. వీటిలో ఎస్సై పోస్టులకు 2.47 ల‌క్ష‌లు, కానిస్టేబుల్ పోస్టుల‌కు 9.50 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 

ఈ ఉద్యోగాల‌కు ద‌రఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల్లో 3.55 ల‌క్ష‌ల మంది ఒక‌టి కంటే ఎక్కువ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ద‌ర‌ఖాస్తుదారుల్లో 2.76 ల‌క్ష‌ల మంది మ‌హిళా అభ్య‌ర్థులున్న‌ట్లు పోలీసు నియామ‌క మండ‌లి శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 7న ఎస్సై, 21న‌ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ప్రాథ‌మిక అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించేందుకు మండ‌లి స‌న్నాహాలు చేస్తోంది. తెలుగులో ప‌రీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్య‌ర్థులు ఆప్ష‌న్ ఇవ్వ‌గా... 32.8 శాతం మంది అభ్య‌ర్థులు ఇంగ్లీష్‌లో ప‌రీక్ష రాసేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.