Digital Currency: భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ... ఆర్బీఐ ప్రణాళిక

RBI says digital currency will be implemented in graded approach
  • భారత్ లోనూ త్వరలో డిజిటల్ కరెన్సీ
  • ఆర్బీఐ పరిశీలనలో డిజిటల్ కరెన్సీ అంశం
  • నేడు ఆర్బీఐ వార్షిక నివేదిక విడుదల
  • తొలుత పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ కరెన్సీ
భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. 

తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని ఆర్బీఐ యోచిస్తోంది. 

భారత్ లో డిజిటల్ కరెన్సీ ప్రవేశంపై ఆర్బీఐ కొంతకాలం కిందటే వెల్లడించింది. పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కరెన్సీ అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ కరెన్సీ కాన్సెప్ట్ ని బలపరిచే అంశాల నిర్ధారణ, పైలట్ ప్రాజెక్టుల్లో వచ్చే ఫలితాలు, కరెన్సీ అమలు... ఇలా దశల వారీగా సీబీడీసీని తీసుకువస్తామని సెంట్రల్ బ్యాంకు వివరించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదటే డిజిటల్ కరెన్సీని తగు మోతాదులో ప్రవేశపెడతామని పేర్కొంది. 

కాగా, దేశంలో డిజిటల్ కరెన్సీ తీసుకురావడంపై 2022-23 కేంద్ర వార్షిక బడ్జెట్లో పేర్కొన్నారని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు రూపొందించిన ఫైనాన్స్ బిల్లులో ఆర్బీఐ చట్టం-1934కు సవరణ అంశాన్ని కూడా పొందుపరిచారని వివరించింది.
Digital Currency
RBI
Annual Report
India

More Telugu News