లడఖ్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు జవాన్ల దుర్మరణం!

27-05-2022 Fri 17:45
  • టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో పడిపోయిన ఆర్మీ వాహనం
  • తీవ్రంగా గాయపడ్డ 19 మంది సైనికులు
  • గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్సులో తరలింపు
7 soldiers killed as army vehicle falls into Shyok river in Ladakh
లడఖ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మరో 19 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ అంబులెన్సులు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఎయిర్ అంబులెన్సుల్లో తరలించారు. 

పార్తాపూర్ లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్ హనీఫ్ లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఆర్మీ వాహనంలో 26 మంది సైనికులు ఉన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.