రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసిన వైసీపీ అభ్య‌ర్థులు

25-05-2022 Wed 19:11
  • విజ‌య‌సాయిరెడ్డికి రెండో సారి రాజ్య‌స‌భ టికెట్
  • బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌ల‌కు వైసీపీ టికెట్లు
  • నామినేష‌న్లు వేసిన న‌లుగురు అభ్య‌ర్థులు
ysrcp candidates tender their nomination to rajyasabha elections
రాజ్య‌స‌భ ఎన్నికల్లో భాగంగా ఏపీ కోటాలో త్వ‌ర‌లోనే ఖాళీ కానున్న నాలుగు స్థానాల‌కు వైసీపీ ఎంపిక చేసిన న‌లుగురు అభ్య‌ర్థులు బుధ‌వారం నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డిని మ‌రోమారు రాజ్య‌స‌భ‌కు పంపేందుకు నిర్ణ‌యించిన వైసీపీ మిగిలిన మూడు స్థానాల‌కు బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌ల‌ను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఈ క్ర‌మంలో బుధ‌వారం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శాస‌న మండలి ఉప కార్య‌ద‌ర్శి పీవీ సుబ్బారెడ్డికి వైసీపీ అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్లను అంద‌జేశారు. ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ, కారుమూరి నాగేశ్వ‌ర‌రాలు వెంట రాగా వైసీపీ అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు.