Maoist: అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తే తన్ని తరిమేయండి: మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేశ్

Maoist Secretary writes Open letter to people to stop ycp mps and mlas
  • ఆదివాసీ ఓట్లతో ఎన్నికైన వీరు ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతిస్తున్నారన్న గణేశ్
  •  రాష్ట్రాన్ని వైసీపీ రుణ, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందంటూ లేఖ
  • బలి ఇచ్చేందుకే అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటు చేశారని ఆరోపణ
  • బాక్సైట్‌ను కొల్లగొట్టేందుకు తెరపైకి జీవో-89 తీసుకొచ్చారని ఆగ్రహం
అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు జి.మాధవి చెట్టి ఫాల్గుణ, భాగ్యలక్ష్మిలను గ్రామాల్లోకి రానీయొద్దని, వస్తే తన్ని తరమాలని మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నిన్న మీడియాకు లేఖ విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ మోసపూరిత, ద్రోహపూరిత విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. ఆదివాసీల ఓట్లతో ప్రజా ప్రతినిధులైన వీరిద్దరూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలన రాష్ట్రాన్ని తీవ్రమైన రుణ, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక, రాజకీయ వివాదాలు పెరిగాయని అన్నారు. దోపిడీ చేయడాన్ని కళగా మార్చుకున్న ప్రభుత్వం అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లాను ఏర్పాటు చేసిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిందని అన్నారు. ఇదంతా దేవతకు బలిచ్చే ముందు జంతువులకు చేసే పూజ లాంటిదని గణేశ్ అన్నారు.

జీవో-97ను తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేసినప్పటికీ అన్‌రాక్ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని మాత్రం రద్దు చేయలేదని గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే జీవో-89ను తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీని అంతం చేయాలన్న లక్ష్యంతో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలతో ప్రభుత్వం వేట కొనసాగిస్తోందని ఆరోపించారు.
Maoist
Andhra Pradesh
YSRCP
Alluri Sitarama Raju District
G.Madhavi
Chetti Palguna

More Telugu News