సిద్ధూని జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పోలీసులు

23-05-2022 Mon 14:56
  • మూడు దశాబ్దాల నాటి కేసులో సిద్ధూకి ఏడాది జైలు శిక్ష
  • పాటియాలా సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న వైనం 
  • అనారోగ్యంతో జైల్లోని ఆహారాన్ని తిరస్కరిస్తున్న సిద్ధూ
Sidhu shifted to hospital from jail
మూడు దశాబ్దాల క్రితం నాటి కేసులో టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాటియాలా సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, జైల్లో అందిస్తున్న ఆహారాన్ని ఆయన తీసుకోవడం లేదు. 

తొలి రోజు రాత్రి రోటి, పప్పు వడ్డించగా... గోధుమల అలర్జీ, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా వాటిని ఆయన తిరస్కరించారు. కాలేయ వ్యాధి, రక్తం గడ్డకట్టడం వంటి అనారోగ్య కారణాలతో ఆయన బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరపు లాయర్ పాటియాలా కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో సిద్ధూకి ప్రత్యేక ఆహారాన్ని అందించాలని కోర్టును ఆయన కోరారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం సిద్ధూని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. పరీక్ష రిపోర్టును కోర్టులో సమర్పించనున్నారు.