ఉమ్మడి పౌర స్మృతి, జనాభా నియంత్రణ చట్టాలు తీసుకురండి: ప్రధానికి రాజ్ థాకరే విజ్ఞప్తి

23-05-2022 Mon 11:03
  • ఔరంగాబాద్ పేరును మార్చాలన్న రాజ్ థాకరే 
  • శంభాజీపూర్ గా నామకరణం చేయాలని సూచన
  • హిప్ బోన్ రీప్లేస్ మెంట్ చేయించుకోవడంవల్లే అయోధ్య పర్యటన వాయిదా వేసుకున్నానన్న ఎంఎన్ఎస్ చీఫ్   
Raj Thackeray urges PM Modi to bring in Uniform Civil Code population control law
దేశంలో ప్రజలందరికీ ఒకటే పౌర చట్టాన్ని (కామన్ సివిల్ కోడ్) త్వరగా తీసుకురావాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్రమోదీని కోరారు. పూణెలో ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా నియంత్రణ చట్టం కూడా తీసుకురావాలని సూచించారు. 

ఔరంగాబాద్ పట్టణం పేరును శంభాజీపూర్ గా మార్చాలని రాజ్ థాకరే కోరారు. ‘‘ఎంఐఎం విస్తరణకు అవకాశం కల్పించే విషయంలో మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం బాధ్యత వహించాలి. శివసేన అభ్యర్థిని ఎంఐఎం అభ్యర్థి (ఇంతియాజ్ జలీల్) ఓడించి, ఔరంగాబాద్ ఎంపీ అవ్వడం షాక్ కు గురి చేసింది’’ అని రాజ్ థాకరే పేర్కొన్నారు. 

ఔరంగజేబు సమాధిని.. ఎంఐఎం ప్రతినిధులు సందర్శించి ప్రార్థనలు నిర్వహించడంతో మహారాష్ట్ర ఉడికిపోతోందన్నారు. అయోధ్య పర్యటనను వాయిదా వేసుకోవడానికి కారణం, తాను హిప్ బోన్ రీప్లేస్ మెంట్ చేయించుకోవడంవల్లేనని చెప్పారు. 

‘‘యూపీలో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేను అక్కడకు వెళితే.. ఎవరో ఒకరు నాపై దాడికి దిగుతారు. దానికి ఎంఎన్ఎస్ కార్యకర్తలు తగిన బదులిస్తారు. దాంతో ఎంఎన్ఎస్ కేడర్ పై కేసులు నమోదవుతాయి. నాపైన, ఎంఎన్ఎస్ కేడర్ పైన ఉచ్చు నెలకొంది. అందుకే కొద్ది కాలం వేచి చూద్దామనుకున్నాను’’ అని రాజ్ థాకరే వివరించారు.