Chandrababu: మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేశారు?: పెట్రోల్ ధ‌ర‌ల‌పై చంద్ర‌బాబు ఫైర్

chandrababu slams ycp
  • కేంద్రం తీసుకున్న‌ నిర్ణయం అభినందనీయమ‌న్న చంద్ర‌బాబు
  • పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి ఉపశమనం కలిగించింద‌ని వ్యాఖ్య‌
  • ప‌లు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయని ట్వీట్
  • ఏపీలోనూ పన్ను తగ్గించాల‌ని కోరిన టీడీపీ అధినేత‌
ఏపీలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుద‌ల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. ''పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అదే సమయంలో ఆయా  రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడం ప్రశంసనీయం.

తెలుగుదేశం హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుంది.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించలేదు. గత ఏడాది చివర్లో దేశంలో అనేక  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించకపోగా... అదనపు పన్నులతో మరింత బాదేస్తున్నారు.

ఇప్పుడు కేంద్రం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6లు పన్ను తగ్గించుకుంది. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేశారు? వైసీపీ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలి'' అని చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News