'మేజర్' ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా: శోభిత ధూళిపాళ

21-05-2022 Sat 18:30
  • 'గూఢచారి'తో పరిచయమైన శోభిత 
  • తాజా ఇంటర్వ్యూలో 'మేజర్' గురించిన ప్రస్తావన 
  • కీలకమైన రోల్ చేశానంటూ వ్యాఖ్య 
  • వచ్చే నెల 3వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా
Major movie update
తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ హిందీ సినిమాలతో నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత తమిళ .. మలయాళ సినిమాలు చేస్తూ, టాలీవుడ్ వైపు వచ్చింది. అడివి శేష్ హీరోగా చేసిన  'గూఢచారి' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఎక్కడా కూడా తన పాత్రలో నుంచి బయటికి రాకుండా భలేగా చేసింది అని చెప్పుకున్నారు.

ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆమె 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాలో ఆమె కీలకమైన పాత్రను పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శోభిత మాట్లాడుతూ .. "ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఇందులో నేను ప్రమోద అనే పాత్రను పోషించాను. 26/11న జరిగిన దాడిలో బందీగా కనిపిస్తాను. ధైర్యం .. నమ్మకం .. ఆశ .. నిరాశ .. భయం .. ఏడుపు .. ఇలా ఎన్నో భావోద్వేగాలు నా పాత్రలో కనిపిస్తాయి. ఇలాంటి ఒక బరువైన పాత్రను పోషించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.