భారత బుల్లెట్ ట్రైన్ కు చైనా చక్రాలు.. ఎందుకంటే..!

21-05-2022 Sat 14:42
  • మొదలుకాని రాయ్ బరేలీ ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ కార్యకలాపాలు
  • రైళ్ల చక్రాల సరఫరాకు ఆటంకాలు
  • 39 వేల చక్రాల కోసం రైల్వేస్ టెండర్
  • చైనాకు చెందిన టీజెడ్ (తైజాంగ్) కంపెనీ బీడ్   
  • రూ.170 కోట్లకు ఆ సంస్థకే ఇచ్చిన రైల్వే
India Bullet Train To Run On Chinese Wheels Here Is Why
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు చైనా చక్రాలే దిక్కవుతున్నాయి. రైలు ఇనుప చక్రాలను తయారు చేసే యూపీ రాయ్ బరేలీలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) సంస్థ కార్యకలాపాలు ఇంకా మొదలు కాకపోవడంతో.. బుల్లెట్ రైలు చక్రాల కోసం భారత రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఆ టెండర్ ను చైనా కంపెనీనే దక్కించుకుంది. 

వాస్తవానికి రాయ్ బరేలీ ప్లాంట్ కు ఏటా లక్ష చక్రాలను తయారు చేసే సామర్థ్యం ఉందని, కానీ, వాణిజ్య కార్యకలాపాలు గత ఏడాది సెప్టెంబర్ లోనే మొదలైనా కొన్ని అనివార్య కారణాల వల్ల సంస్థ ఇంకా పూర్తి స్థాయిలో నడవడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. సంస్థ నుంచి చక్రాల సరఫరా జరిగేందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నారు. లింఖ్ హాఫ్ మాన్ బుష్ కోచ్ ల కోసం ఏటా 60 వేల చక్రాలను రైల్వేస్ దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. 

రెండేళ్లుగా చక్రాలను ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కానీ, ఇప్పుడు యుద్ధ పరిస్థితులతో అది సాధ్యం కావడం లేదని అంటున్నారు. దిగుమతులమీద ఆధారపడడం తగ్గించుకునేందుకు రాయ్ బరేలీ ప్లాంట్ ను నమ్ముకుంటున్నా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని అన్నారు. అక్కడి నుంచి సరఫరా కాకపోవడం.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల టెండర్లను పిలవాల్సి వచ్చిందన్నారు. 

ఈ క్రమంలోనే 39,000 చక్రాల సరఫరాకు చైనాకు చెందిన టీజెడ్ (తైజాంగ్) కంపెనీ రూ.170 కోట్లకు బిడ్ వేసిందని, ఆ సంస్థకే టెండర్ ను ఇచ్చామని చెప్పారు. వందే భారత్ రైళ్ల కోసం 8 వేల చక్రాలకు అదే కంపెనీకి మరో ఆర్డర్ కూడా ఇచ్చామన్నారు.