Begum Bazar: బేగంబజార్ పరువుహత్య: 2 నెలల బాబుతో రోడ్డుపై బైఠాయించిన మృతుడి భార్య

  • షా ఇనాయత్ గంజ్ పీఎస్ ఎదుట ధర్నా
  • చంపింది తన సోదరులేనని ఆరోపణ 
  • హత్య చేసిన వారిని ఉరితీయాలంటూ డిమాండ్
  • తన కూతురు జీవితాన్ని నాశనం చేశారన్న తల్లి
  • హత్యతో తన కుమారులకు సంబంధం లేదని వెల్లడి
Begum Bazar Honour Killing Deceased Wife Furious Over her Brothers

హైదరాబాద్ బేగంబజార్ లోని పరువు హత్య కేసులో.. మృతుడు నీరజ్ భార్య సంజన ధర్నా చేపట్టింది. రెండు నెలల కుమారుడితో బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. తన భర్తను చంపిన వారిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేసింది. తన సోదరులే నీరజ్ ను చంపారని, ఏడాది కాలంగా చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆమె చెప్పింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెట్టారని, ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది.  

షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు వ్యక్తులు నీరజ్ ను వెంటాడి కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. హత్యకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గుర్తించేందుకు సంజనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. 

ఈ నేపథ్యంలోనే సంజన, ఆమె బంధువులు గంట పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిందితులను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. శిక్షపడేలా చూస్తామంటూ అధికారులు, ఎమ్మెల్యే రాజాసింగ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇటు హత్య నేపథ్యంలో వ్యాపారులు బేగంబజార్ బంద్ కు పిలుపునిచ్చారు.   
 
హత్య ఘటనపై సంజన తల్లి, సోదరి స్పందించారు. తన కూతురు జీవితాన్ని నాశనం చేశారని తల్లి మధుభాయి ఆవేదన వ్యక్తం చేసింది. హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేసింది. తన కుమారులకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తన కూతురు, అల్లుడిని చంపుతామంటూ కొందరు బెదిరించారని, వాళ్లెవరో కూడా తెలియదని చెప్పింది. హత్య సమయంలో తన కొడుకు రితేశ్, తన బావ కుమారులు నలుగురూ ఇంట్లోనే ఉన్నారని పేర్కొంది. హత్య విషయం తెలిసి భయపడి పారిపోయారని చెప్పింది. 

సంజనతో ఏడాది నుంచి మాటలు లేవని ఆమె సోదరి మమత చెప్పింది. అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు నెలలుగా తనతో మాట్లాడుతోందని తెలిపింది. ప్రేమ వివాహం ఇష్టం లేకనే ఆమెను దూరం పెట్టామని, భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకున్నామని చెప్పింది. హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించింది.  

More Telugu News