ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్.. కొన్ని రోజుల పాటు దేశ పర్యటనలో సీఎం!

20-05-2022 Fri 16:41
  • కేసీఆర్ వెంట వెళ్లిన పలువురు టీఆర్ఎస్ నేతలు
  • జాతీయ స్థాయిలో పలువురు నేతలను కలవనున్న సీఎం
  • అన్నా హజారేను కూడా కలవనున్న కేసీఆర్
KCR leaves to Delhi
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు, సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఈ నెల 22న ఢిల్లీ నుంచి ఆయన చండీఘడ్ వెళ్తారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. 

ఈ నెల 26న ఉదయం కేసీఆర్ బెంగళూరుకు వెళ్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అవుతారు. మే 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధీకి వెళ్లి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో సమావేశమవుతారు. అక్కడ నుంచి షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాదుకు తిరిగి వస్తారు.