నిజ జీవితంలో కూడా జీవిత బాగా నటిస్తుంది: 'గరుడవేగ' నిర్మాతలు హేమ, కోటేశ్వరరాజు

20-05-2022 Fri 16:26
  • జీవితపై విమర్శలు గుప్పించిన 'గరుడవేగ' సినిమా నిర్మాతలు
  • మమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వ్యాఖ్య
  • సెలబ్రిటీ పేరుతో జీవిత మోసం చేస్తోందన్న నిర్మాతలు
Garudavega producers fires on Jeevitha
రాజశేఖర్ సినిమా 'గరుడవేగ' చిత్రం విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. జీవిత, ఆ సినిమా నిర్మాతలు హేమ, కోటేశ్వరరావుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషయంపై నిన్న జీవిత మాట్లాడుతూ ఈ అంశం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు తమ గురించి మీడియాలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత వ్యాఖ్యలపై 'గరుడవేగ' నిర్మాతలు హేమ, కోటేశ్వరరాజు మండిపడ్డారు. 

జీవిత మహానటి అని, నిజ జీవితంలో కూడా ఆమె అద్భుతంగా నటిస్తారని వారు అన్నారు. తమను చంపేస్తామని బెదిరించారని చెప్పారు. తొలుత తాము ఎవరో కూడా తెలియదన్నట్టుగా జీవిత మాట్లాడారని, నిన్న పరిధులు దాటి తమ గురించి మాట్లాడారని అన్నారు. తాము పరువు గల కుటుంబం నుంచి వచ్చామని చెప్పారు. 

సెలబ్రిటీ పేరుతో జీవిత మోసం చేస్తోందని మండిపడ్డారు. గరుడవేగ సినిమాకు సంబంధించి తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని... అన్నింటినీ ఆధారాలతో సహా తాము కోర్టులో సమర్పించామని తెలిపారు. కోర్టులో తాము విజయం సాధించడం ఖాయమని చెప్పారు.