Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్‌లోని పదార్థాలన్నీ సేఫ్.. భయం లేకుండా తినేయొచ్చంటూ ‘ఈట్ రైట్’ గుర్తింపు

  • దేశవ్యాప్తంగా ఆరు స్టేషన్లకు మాత్రమే ‘ఈట్ రైట్’ గుర్తింపు
  • ఏడో స్టేషన్‌గా విశాఖపట్టణం
  • ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక స్టేషన్‌గా గుర్తింపు
 Vizag railway station gets Eat Right certificate

రైల్వే స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాలు తినేందుకు చాలా మంది సందేహిస్తారు. పరిశుభ్రత, నాణ్యతపై పెదవి విరుస్తారు. కాబట్టే చాలామంది వాటికి దూరంగా ఉంటారు. అయితే, విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో విక్రయించే ఆహారా పదార్థాలను ఎలాంటి సందేహం, భయం లేకుండా ఎంచక్కా తినేయొచ్చంటోంది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ). ఈ స్టేషన్‌ను ‘ఈట్ రైట్’ స్టేషన్‌గా గుర్తిస్తూ ఫోర్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చేసింది.

దేశంలో ఇలాంటి గుర్తింపు కలిగిన స్టేషన్లు ఇప్పటి వరకు ఆరు మాత్రమే ఉన్నాయి. వీటిలో చండీగఢ్, ఢిల్లీలోని ఆనంద విహార్, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై-సెంట్రల్ రైల్వే స్టేషన్, వడోదరా, భువనేశ్వర్ స్టేషన్లు ఉండగా, ఇప్పుడా జాబితాలోకి విశాఖపట్టణం వచ్చి చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘ఈట్ రైట్’ గుర్తింపు కలిగిన ఏకైక స్టేషన్ విశాఖపట్టణం కావడం గమనార్హం. కాగా, ఒక్క విశాఖ మాత్రమే కాకుండా మిగిలిన స్టేషన్లలోనూ ఇలాంటి ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు డీఆర్ఎం అనూప్ కుమార్ తెలిపారు.

More Telugu News