ఆడియన్స్ కు విభిన్న తరహా చిత్రం ఇవ్వాలని 'శేఖర్' సినిమా చేశాను: హీరో రాజశేఖర్

19-05-2022 Thu 22:42
  • రాజశేఖర్ హీరోగా శేఖర్
  • జీవిత దర్శకత్వంలో చిత్రం
  • మే 20న విడుదల
  • మీడియాతో ముచ్చటించిన చిత్రబృందం
Rajasekhar movie Sekhar set to release
యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం శేఖర్. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్, ఇతర చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. రాజశేఖర్ మాట్లాడుతూ, తాను కరోనా బారిన పడిన సమయంలో మళ్లీ నటిస్తానని అనుకోలేదని అన్నారు. 

"కోవిడ్ తో బాధపడుతూ ఐసీయూలో ఉన్నప్పుడు టీవీలో వచ్చే డాన్స్, ఫైట్ సీన్స్ చూసి... నేను ఇలా డాన్స్, ఫైట్స్ చేసే వాడిని, ఇలా అయిపోయాను కదా అని బాధపడ్డాను. ఇక నా జీవితం అయిపోయింది, నేను సినిమాకు పనికిరాను "జోసఫ్" సినిమా ఎవరికైనా ఇచ్చేయాలి అనే స్టేజ్ కు వెళ్ళాను" అని వివరించారు. 

ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి రాజశేఖర్ ను ఓ ప్రశ్న అడిగారు. 'ఎప్పుడూ చెప్పని మీరు నా సినిమాను బతికించండి అని చెప్పారు, ఆ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది..?' అని అడిగారు. అందుకు రాజశేఖర్ బదులిస్తూ... "ఇంతవరకు నా వెనక ప్రాపర్టీ ఉండేది. ఇప్పుడు అవన్నీ అప్పుల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయితేనే నేను అప్పుల నుంచి బయటపడతాను. అందుకే నేను ఎప్పుడూ లేని టెన్షన్ తో నా మనసులో నుంచి వచ్చిన మాట అది. నన్ను, నా సినిమాను బతికించండి అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది. 

ఆడియన్స్ ఎదురు చూసేలా ఒక విభిన్నమైన చిత్రాన్ని ఇవ్వాలని విభిన్నమైన చిత్రాన్ని ఎన్నుకుని వచ్చాను. ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్ గా చాలా సంతృప్తి చెందాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్, ఆ పరిస్థితి క్యారెక్టర్లో చూపిస్తూ ప్రేక్షకులకు చాలా విషయాలు అర్థం అవ్వాలి. శేఖర్ ఎ మ్యాన్ విత్ ద స్కార్ అని ఉంది. ఆ స్కార్ తో ఉన్న వాడు ఎలా ఉండాలి అనేది ఈ క్యారెక్టర్ ద్వారా చూపించాం. 

55 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయసు ఉండే ఈ క్యారెక్టర్ కు కొత్త లుక్ ఉంటే ఈ సినిమానే డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది, కొత్త లుక్ ఉంటేనే సినిమాకు ప్లస్ అవుతుంది అని ఆలోచించి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ వేయడం జరిగింది. ఆ గెటప్ వేసి షూటింగ్ చేసినప్పటి రోజు నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఈ గెటప్ సూపర్ గా ఉంది అని చెప్పడంతో నాకు ఈ సినిమాపై గట్టి నమ్మకం ఏర్పడింది. 

కానీ ఎక్కడో భయం కూడా ఉండేది. అయితే మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. జీవిత ఈ సినిమా సెన్సార్ కొరకు వెళ్ళినప్పుడు వారు ఈ సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు. దాంతో మాకు ఇంకా ధైర్యం వచ్చింది. మేము ఈ సినిమాను కొంతమంది మా క్లోజ్ ఫ్రెండ్స్ కు కూడా చూపించాం. వారు సినిమా చూసి చాలా బాగుందని చెప్పారు. 

జీవిత, నేను సెట్లో ఉన్నప్పుడు తను ఒక డైరెక్టర్ గా, నేను ఆర్టిస్ట్ లాగే ఉంటాం. అయితే షూటింగ్ తర్వాత ఇద్దరం క్యారెక్టర్ కోసం అప్పుడప్పుడూ డిస్కషన్ చేసుకుంటాం. తను నాతో.. బంగారం ఈ క్యారెక్టర్ లో నువ్వు ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, అక్కడ తగ్గిస్తే బాగుంటుందని సూచిస్తుంది. జీవిత  చాలా మంచి డైరెక్టర్ అందరి దగ్గర నుంచి మెరుగైన పనితీరు రాబట్టుకుంటుంది. ప్రతి సీన్ పండిస్తుంది, అందులో ఫీల్ ను, సోల్ ను చెడగొట్టకుండా చాలా చక్కగా తీస్తుంది.

నా సినిమాలన్నీ కూడా తలంబ్రాలు, ఆహుతి, అంకుశం మగాడు, మా అన్నయ్య, సింహరాశి, మా ఆయన బంగారం, ఇలా నా సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. రీమేక్ లో తీసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యాయి  అయితే ఒక్క "శేషు" మాత్రం పెద్ద సక్సెస్ కాలేదు. అయితే టీవీ లో మాత్రం హిట్ అయ్యింది. 

జోసెఫ్ మలయాళం లో సక్సెస్ అయ్యింది. మలయాళంలో సక్సెస్ అయిన సినిమాలు చాలా చేశాను. రీమేక్ చేస్తే మనకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే జోసెఫ్ ను సెలెక్ట్ చేసి శేఖర్ గా రీమేక్ చేశాం.  రీమేక్ అయితే, నేను ఏం చెయ్యాలో నా క్యారెక్టర్ కూడా నాకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి నటుడిగా నాకు ఈజీ అవుతుంది. జోసఫ్ సినిమాతో శివానీ, శివాత్మిక ఇద్దరికీ బిగినింగ్ అని చెప్పాలి. మంచి పేరు వచ్చింది.శివాత్మిక దొరసాని సినిమా చేయడం తెలిసిందే. శివాని టూ స్టేట్స్ సగం వరకు అయ్యింది. తర్వాత శివాని సినిమాలు అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ రిలీజ్ అవగా, అందరూ మెచ్చుకున్నారు. 

అలాగే శివాత్మిక కృష్ణవంశీ గారితో రంగమార్తాండ సినిమా చేస్తోంది. ఆ సినిమాలో ఉన్న బ్రహ్మానందం, కృష్ణవంశీ, ప్రకాష్ రాజు, రమ్య కృష్ణ  వీరంతా నాకు ఫోన్ చేసి మీ ఆమ్మాయి చాలా బాగా చేస్తుంది అని మెచ్చుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శేఖర్ చిత్రంలో కూతురి పాత్రకు శివాని, శివాత్మిక ఇద్దరినీ వద్దు అన్నాను. జీవిత మాత్రం... మన కూతురు అయితే  ప్రేక్షకులకు చూడడానికి బాగుంటుంది అని చెప్పింది. దాంతో ఈ సినిమాలో ఎవరు చేస్తారు అని ఇద్దరినీ అడిగితే, శివాత్మిక అక్క కోసం త్యాగం చేసి ఈ సినిమా శివానికి ఇవ్వడం జరిగింది. 

నా 37 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో 27 సంవత్సరాలు సాయి కుమార్ గారు నాకు డబ్బింగ్ చెప్పారు. అయితే మధ్యలో పది సంవత్సరాలు శ్రీనివాస్ మూర్తి గారు చెప్పడం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో నాకు సాయి కుమార్ గారి వాయిస్ చెప్పారు. అయితే ఎవరు చెప్పినా ఆడియన్స్ గుర్తుపట్టని విధంగా వాయిస్ చెప్పడం జరిగింది. 

కోవిడ్ టైమ్ లో చాలా దుర్భర స్థితి అనుభవించాను. ఓ రకంగా మృత్యుముఖం నుంచి బయటపడ్డాను. ఐసీయూలో నాకు బోర్ కొట్టకుండా టీవీ పెట్టారు. ఆ టీవీ లో హీరోలు డాన్స్, ఫైట్ సీన్స్ చూసి ఏడ్చాను. జీవితతో నా జీవితం అయిపోయింది నేను సినిమాకు పనికిరాను "జోసఫ్" సినిమా ఎవరికైనా ఇచ్చేసేయ్, లేట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు అని చెపితే.. ఏం కాదు మీరు కోలుకుంటారు అని జీవిత ధైర్యం చెబుతూ వచ్చింది. అయితే సినిమాపై ఉన్న కసితో నేను మెల్లమెల్లగా కోలుకొని ఈ సినిమాను కంప్లీట్ చేయడం జరిగింది. 

ఒరిజినల్ వెర్షన్ కి ఈ సినిమాకు పెద్ద చేంజెస్ అంటే ఏమి ఉండవు కానీ, చిన్నచిన్న మార్పులు ఉంటాయి.  తెలుగు ఆడియన్స్ కు అర్థమయ్యే విధంగా కొన్ని వివరణలు ఉంటాయి.  ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అనూప్ రూబెన్స్ మ్యాజిక్ చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ  సినిమాలో నా క్యారెక్టర్ కచ్చితంగా స్మోక్ చెయ్యాలి. మ్యూజిక్ కు  స్మోక్ ముడిపడి ఉంటుంది. కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత నన్ను స్మోక్ చేయకూడదని డాక్టర్లు చెప్పారు. నువ్వు స్మోక్  చేస్తే మీ లంగ్స్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ డేంజర్ లోకి వెళ్ళిపోతారని చాలా నిబంధనలు పెట్టారు. కానీ నా క్యారెక్టర్ స్మోక్ చేయకపోతే సినిమా ఎఫెక్ట్ ఉండదు. అయితే ఈ సినిమాపై కసి, పిచ్చి వల్ల నేను ఏమైనా పర్వాలేదు... ఈ సినిమా బాగా రావాలి హిట్ అవ్వాలి అని మళ్లీ స్మోక్ చేసి సినిమా చేశాను.  

నా తమ్ముడు చెన్నై లో ఉంటాడు. వాడికి ఇద్దరు కొడుకులు. వాడు నాతో... నువ్వు ఈ రోజు రికవర్ అయ్యి ఈ పొజిషన్ లో ఉన్నావు అంటే దానికి కారణం నీ కూతుర్లు.. మీ ఇద్దరు కూతుర్లు నిన్ను కాపాడారు అది బాగా గుర్తు పెట్టుకో... ఎందుకంటే వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. నా కొడుకులు మాత్రం నన్ను సరిగా చూసుకోవడం లేదు అన్నాడు. అయితే నా తమ్ముడు చెప్పినట్లు నా పిల్లలు, జీవిత నన్ను చాలా బాగా చూసుకున్నారు. వారు ఇంటికి కూడా వెళ్లకుండా నా కోసం హాస్పిటల్ ఐసీయూలోనే ఉండిపోయారు. నన్ను అంత బాగా చూసుకున్నారు. అప్పుడే నాకు అనిపించింది.... కూతుర్లు చాలా రెస్పాన్సిబులిటీ గా, అనుబంధంతో ఉంటారు అని. 

దొరసాని దర్శకుడు మహేందర్ మా ఫ్యామిలీ లోని నలుగురిని  పెట్టి ఒక సినిమా తీయాలని అనుకున్నారు. కొన్ని కరెక్షన్స్ చేయాలని అనుకుంటున్నాం. అలాగే ప్రవీణ్ సత్తారు గరుడవేగ పార్ట్ 2 లో మీ కూతుళ్లను కూడా యాడ్ చేద్దామని అన్నారు. దర్శకుడు సుకుమార్ గారు నా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలా చెప్పడం చాలా సంతోషం అనిపించింది. 

ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత పెద్ద దర్శకుడితో మంచి కాంబినేషన్ లోనే పాన్ ఇండియా సినిమా అనౌన్స్మెంట్ చేస్తాము... అది త్వరలో తెలియజేస్తాను. మే 20 న వస్తున్న మా సినిమాను మీరందరూ థియేటర్ కు వచ్చి చూడండి మా సినిమా నచ్చితేనే.. పదిమందికి చెప్పండి" అని ముగించారు. 

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు.