Ranabir Bhattacharyyaa: కరోనా వల్ల ఉద్యోగం మాత్రమే పోయింది.. ఆత్మవిశ్వాసం కాదు: ఉబెర్ డ్రైవర్‌గా మారిన కోల్‌కతా మహిళ

  • కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మౌతుషి బసు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బసు స్టోరీ
  • పోస్టు చేసిన రచయిత రణవీర్ భట్టాచార్య
  • ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్ల ఫిదా
From Panasonic employee to Uber rider Moutushi Basu story

అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగం ఒక్కసారిగా ఊడిపోతే కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. మరికొందరు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడతారు. ఇంకొందరు మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ రోజులు గడిపేస్తారు. కొందరు మాత్రమే వినూత్నంగా ఆలోచిస్తారు. పుష్కలంగా ఉన్న ఆత్మవిశ్వాసం అనుభవం లేని పనిలోనూ రాణించేలా చేస్తుంది. 

ఇందుకు కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల మౌతుషి బసు నిలువెత్తు నిదర్శనం. కరోనా లాక్‌డౌన్‌కు ముందు ఆమె పానసోనిక్ కంపెనీలో పనిచేసేవారు. కరోనా కారణంగా దేశంలోని లక్షలాదిమందిలానే ఆమె కూడా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే, ఉద్యోగం పోయిందని ఆమె బాధపడుతూ కూర్చోలేదు. కుటుంబ పోషణ కోసం తనకు ఏమాత్రం పరిచయం లేని రంగాన్ని ఎంచుకున్నారు. ఉబెర్ డ్రైవర్‌గా మారి బిజీ అయిపోయారు. 

రచయిత రణవీర్ భట్టాచార్య లింక్డిన్‌లో ఆమె కథను షేర్ చేయడంతో వైరల్ అయింది. ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. కోల్‌కతాలో తాను బయటకు వెళ్లేందుకు ఉబెర్ బైక్‌ను బుక్ చేస్తే మౌతుషి బసు వచ్చారని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆమెను ప్రశ్నిస్తే.. తను చెప్పిన విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. తాను పానసోనిక్‌లో ఉద్యోగం చేసేదానినని, కరోనా కారణంగా ఉద్యోగం పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఇలా రైడర్‌గా మారినట్టు చెప్పారని రణవీర్ తెలిపారు. 

ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఆమె బండిని చాలా జాగ్రత్తగా నడిపారని, అందుకు అదనంగా డబ్బులు ఏమీ అడగలేదని పేర్కొన్నారు. ఇలా రైడర్ గా మారాలని ఎందుకు అనిపించిందని అడిగితే, కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదని, అందుకే తెలిసున్న విద్యనే ఎంచుకున్నానని ఆమె చెప్పారని వివరించారు. బసు కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

More Telugu News