Mumbai: బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం అసహజ లైంగిక నేరమేమీ కాదు: బాంబే హైకోర్టు

  • బాలుడి పెదవులపై ముద్దులు పెడుతూ, ప్రైవేటు పార్టులను తడిమిన రీచార్జ్ షాపు యజమాని
  • పోక్సో, సెక్షన్ 377 కింద కేసుల నమోదు
  • ఏడాదిగా జైలులో ఉన్న నిందితుడు
  • బెయిలు మంజూరు చేసిన కోర్టు
 Kissing and Fondling Boy Not Unnatural Offence says Bombay High Court

14 ఏళ్ల బాలుడిని ముద్దు పెట్టుకోవడంతోపాటు ప్రైవేటు పార్టులు కూడా తడమాడంటూ ఓ వ్యక్తిపై నమోదైన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం, తడమడం వంటి వాటిని అసహజ లైంగిక నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిలు మంజూరు చేసింది. 

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి బీరువాలోని డబ్బులు తరచూ మాయం అవుతుండడంతో తన 14 ఏళ్ల కుమారుడిని అనుమానించాడు. డబ్బులు ఏమవుతున్నాయని గద్దించగానే బాలుడు నిజం ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు తానే తీస్తున్నానని, వాటితో ఆన్‌లైన్ గేమ్స్ రీచార్జ్ చేయించుకుంటున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో మరో విషయాన్ని కూడా బాలుడు బయటపెట్టాడు.

తాను రీచార్జ్ కోసం షాపునకు వెళ్లినప్పుడు దాని యజమాని తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెడుతున్నాడని, ప్రైవేటు పార్టులు తడుముతున్నాడని చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 377 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

ఏడాదిగా జైలులో ఉన్న నిందితుడు ఇటీవల బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభు దేశాయ్.. నిందితుడు బాలుడి పెదాలపై ముద్దులు పెట్టాడని, తాకాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని, అయితే ఈ అభియోగాలు సెక్షన్ 377 కిందికి రావని తేల్చిచెబుతూ నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. నిజానికి సెక్షన్ 377 కింద కేసు నమోదైతే బెయిలు రావడం కష్టమవుతుంది. అంతేకాదు, జీవిత శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

More Telugu News