Devasahayam: కులవివక్షపై పోరాడిన సామాన్య భారతీయుడికి సెయింట్ హుడ్.. ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్

18th Century Indian Who Fought Casteism Declared Saint By The Vatican
  • 18వ శతాబ్దంలో అప్పటి ట్రావెన్‌కోర్ రాజ్యంలో జన్మించిన దేవసహాయం
  • భారత్‌లోని ఓ సామాన్య మానవుడికి ‘సెయింట్ హుడ్’ దక్కడం ఇదే తొలిసారి
  • దేవసహాయాన్ని ప్రార్థించిన తర్వాత మెడికల్ డెడ్ అయిన పిండంలో కదలికలు
  • ఈ అద్భుతం తర్వాత సెయింట్ హుడ్‌కు ఎంపిక

భారతదేశంలో అప్పటి ట్రావెన్‌కోర్ రాజ్యంలో 18వ శతాబ్దంలో జన్మించి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దేవసహాయం పిళ్లైకి సెయింట్ హుడ్ లభించింది. ఆయనను సెయింట్ (దేవదూత)గా ప్రకటిస్తూ పోప్ ఫ్రాన్సిస్ నిన్న ప్రకటన చేశారు. ఫలితంగా ఈ అరుదైన గుర్తింపు పొందిన సామాన్య భారతీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు. 

దేవసహాయం పిళ్లైకి సెయింట్ హుడ్ ప్రకటించాలన్న తమిళనాడుకు చెందిన బిషప్ కౌన్సిల్, ‘కేథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా’ సదస్సు అభ్యర్థన మేరకు 2004లో బీటిఫికేషన్ (పరమ ప్రాప్తి) వేడుకకు దేవసహాయం పేరును ప్రతిపాదించింది. తాజాగా నిన్న దేవసహాయంతోపాటు మరో 9 మంది పేర్లను మత గురువుల జాబితాలో చేర్చారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉండడం గమనార్హం.

దేవసహాయం 23 ఏప్రిల్ 1712లో ట్రావెన్‌కోర్ రాజ్యంలోని నట్టాళం గ్రామంలో హిందూ నాయర్ల కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు నీలకందన్ పిళ్లై అని నామకరణం చేశారు. 1745లో క్రైస్తవం స్వీకరించిన ఆయన దేవ సహాయం పిళ్లైగా పేరు మార్చుకున్నారు. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. ట్రావెన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ కొలువులో అధికారిగా ఉన్న ఆయన మతమార్పిడి కారణంగా ఉన్నత వర్గాల ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. 14 జనవరి 1752లో మరణశిక్షకు గురయ్యారు.

ఏడో నెల గర్భిణిగా ఉన్న ఓ మహిళ 2013లో దేవసహాయాన్ని ప్రార్థించిన తర్వాత అద్భుతం జరిగింది. ఆమె గర్భంలో పెరుగుతున్న పిండం ‘మెడికల్ డెడ్’ అయిందని వైద్యులు చెప్పారు. అయితే, దేవసహాయాన్ని ప్రార్థించిన తర్వాత పిండంలో కదలికలు మొదలైనట్టు ఆమె చెప్పింది. ఈ అద్భుతం వెలుగులోకి రావడంతో దేవసహాయం సెయింట్ హుడ్‌కు ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News