ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళుతున్న ' కేజీఎఫ్ 3'

14-05-2022 Sat 17:21
  • భారీ విజయాన్ని అందుకున్న 'కేజీఎఫ్'
  • అంతకు మించిన విజయాన్ని సాధించిన 'కేజీఎఫ్ 2'
  • 'కేజీఎఫ్ 3' దిశగా జరుగుతున్న పనులు
  • ఈ అక్టోబర్లో షూటింగు మొదలంటూ జరుగుతున్న ప్రచారం
KGF 3 Movie Ipdate
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తరువాత వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి ' కేజీఎఫ్  2' పేరుతో ఇటీవల సీక్వెల్ ను వదిలారు. ఇది బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించింది. 
 
తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి ఈ సినిమా ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక బాలీవుడ్ లోను ఈ సినిమా వసూళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అటు ప్రశాంత్ నీల్ .. ఇటు యశ్ ఇద్దరూ కూడా క్లారిటీ ఇచ్చేశారు.

అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టొచ్చని అనుకుంటే పొరపాటే. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఒక వైపున 'సలార్' సెట్స్ పైనే ఉంది. మరో వైపున ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు. ఈ మధ్యలోనే ఈ 'కేజీఎఫ్ 3' ప్రాజెక్టును మొదలెట్టాలనుకోవడం విశేషమే.