‘అసని’ తుపాను ఎఫెక్ట్.. నేడు మరో ఆరు రైళ్లను రద్దు చేసిన రైల్వే.. ఆ రైళ్లు ఇవే!

  • మచిలీపట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను
  • ఏపీలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రేపు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనున్న ‘అసని’
South Central railway Cancelled six Trains because of cyclone asani

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను మచిలీపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయవ్య దిశగా పయనించి ఉదయం 11 గంటలకు ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే నేడు మరో ఆరు రైళ్లను రద్దు చేసింది.

రద్దు చేసిన రైళ్లలో గుంటూరు-రేపల్లె (07784), రేపల్లె-గుంటూరు (07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267), విశాఖపట్టణం-కాకినాడ పోర్ట్ (17268) రైళ్లు ఉన్నాయి. అలాగే, గుంటూరు-డోన్ (17228) రైలును రీ షెడ్యూల్ చేశారు. ఈ రైలు నేడు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాల్సి ఉండగా, మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

కాగా, తుపాను ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, తుపాను రేపు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

More Telugu News