BJYM: ఆ వార్తలు అవాస్తవం.. బీజేపీ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై రాహుల్ ద్రవిడ్

  • ధర్మశాలలో ఈ నెల 12 నుంచి 15 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ సదస్సు
  • ద్రవిడ్ హాజరై యువతకు సందేశమిస్తారన్న ధర్మాశాల బీజేపీ ఎమ్మెల్యే
  • ఆ వార్తలను కొట్టిపడేసిన ద్రవిడ్
Incorrect Rahul Dravid On Report Claiming He will Attend BJP Event

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 12-15 మధ్య జరగనున్న బీజేపీ యువ మోర్చా జాతీయ వర్కింగ్ కమిటీ సదస్సుకు తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, తాను ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టతనిచ్చాడు. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పాడు. 

ధర్మశాల సదస్సుకు రాహుల్ ద్రవిడ్ వస్తున్నారంటూ బీజేపీ ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా ఇటీవల తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర బీజేపీ నేతలు హాజరవుతారని, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై యువతకు సందేశం ఇస్తారని అన్నారు. ద్రవిడ్ పాల్గొంటున్నట్టు మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో స్పందించిన మాజీ క్రికెటర్.. ఆ వార్తలను కొట్టిపడేశాడు.

ఇదిలావుంచితే, హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017 ఎన్నికల్లో 68 స్థానాలకు గాను బీజేపీ 44 స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌కు 21 స్థానాలు లభించాయి. ఇతరులకు మూడు సీట్లు లభించాయి.

More Telugu News