Sri Satya Sai Dist: శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం.. బాలింతపై సామూహిక అత్యాచారం, హత్య

Woman Got Gang Raped and Murdered in Sri Satya Sai dist
  • బహిర్భూమికి వెళ్లిన మహిళను బండరాయితో మోది హత్య చేసిన దుండగులు
  • ముందస్తు పథకంలో భాగంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం
  • నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
శ్రీ సత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది.  బహిర్భూమికి వెళ్లిన ఓ బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపై బండరాయితో మోది దారుణంగా హత్యచేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడు నెలల క్రితం ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. పది రోజుల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. నిన్న ఉదయం బాబును తోడికోడలకు అప్పగించి బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే అక్కడ కాపుకాసిన నిందితులు ఆమెపై దాడికి దిగారు. అత్యాచారం చేసి ఆపై బండరాయితో మోది హత్యచేశారు. 

బహిర్భూమికి వెళ్లిన ఆమె 10 గంటలు అవుతున్నా తిరిగి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు గాలించగా ఊరిబయట విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ముఖం పూర్తిగా ఛిద్రమై ఉండడాన్ని గుర్తించారు. సమీపంలోని బావి వద్ద ఉన్న బండరాళ్లను తెచ్చి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. 

ముందస్తు పథకంలో భాగంగానే గ్రామానికి చెందిన కొందరు ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. బంధువుల్లోనే కొందరిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Sri Satya Sai Dist
Gang Rape
Murder
Andhra Pradesh

More Telugu News