Sourav Ganguly: మమతా బెనర్జీ నాకెంతో సన్నిహితురాలు: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly says West Bengal CM Mamata Banarjee very close to him
  • కోల్ కతాలో గంగూలీ ఇంటికి వచ్చిన అమిత్ షా
  • దాదా ఇంట్లో కేంద్రమంత్రికి విందు 
  • గంగూలీ రాజకీయాల్లో చేరుతున్నాడంటూ ఊహాగానాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్ కతాలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నివాసంలో డిన్నర్ చేయడం తెలిసిందే. ఈ విందు వ్యవహారం రాజకీయ పరంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో, గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు కోల్ కతాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్స కార్యక్రమంలో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకెంతో సన్నిహితురాలని వెల్లడించారు. ఈ ఆసుపత్రి నిర్మించాలనుకున్న డాక్టర్ ను సీఎం వద్దకు తీసుకెళ్లానని, ఆమె వెంటనే స్పందించి సహాయసహకారాలు అందించారని గంగూలీ వెల్లడించారు. 

గంగూలీ నివాసానికి అమిత్ షా వెళ్లిన నేపథ్యంలో, దాదా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఊహాగానాలు బయల్దేరాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలో, గంగూలీ అప్పుడే వివరణ ఇచ్చారు. అమిత్ షాతో తనకు 2008 నుంచి పరిచయం ఉందని వెల్లడించారు. ఇప్పుడాయన కుమారుడు (జై షా-బీసీసీఐ కార్యదర్శి)తో పనిచేస్తున్నానని తెలిపారు. 

ఇక గంగూలీ ఇంటికి అమిత్ షా వస్తున్న సంగతిపై సీఎం మమతా బెనర్జీ కూడా మొన్ననే స్పందించారు. అతిథులను ఇంటికి పిలవడం బెంగాలీ ప్రజల సంస్కృతి అని పేర్కొన్నారు. "సౌరవ్ ఇంటికి హోంమంత్రి వస్తే ఏమైనా అరిష్టమా? హోంమంత్రికి 'మిష్టీ దోయి' (సుప్రసిద్ధ బెంగాలీ వంటకం) వడ్డించాలని సౌరవ్ కు చెబుతాను" అంటూ దీదీ అమిత్ షా పర్యటనను తేలిగ్గా తీసుకున్నారు.
Sourav Ganguly
Mamata Banerjee
Amit Shah
Kolkata
West Bengal

More Telugu News