Pakistan: పాకిస్థాన్‌లో పరువు హత్య: మోడలింగ్ చేస్తోందని సోదరిని కాల్చి చంపిన అన్న

  • కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా మోడలింగ్, డ్యాన్సింగ్
  • విడిచిపెట్టాలని పలుమార్లు హెచ్చరించిన కుటుంబం
  • సోదరి డ్యాన్స్ చేస్తున్న వీడియో చూసి కోపంతో రగిలిపోయిన సోదరుడు
  • పాక్‌లో సర్వసాధారణంగా మారిన పరువు హత్యలు
Pakistani man shoots dead sister for dancing and modelling

డ్యాన్స్, మోడలింగ్ చేస్తున్న సోదరిని చూసి సహించలేని ఓ యువకుడు ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. పరువు హత్యగా భావిస్తున్న ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగింది. లాహోర్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెనలా ఖుర్దా ఒకారాకు చెందిన 21 ఏళ్ల సిద్రా స్థానిక క్లాతింగ్ బ్రాండ్‌కు మోడలింగ్ చేస్తోంది. అలాగే, ఫైసలాబాద్‌లో థియేటర్లలో నృత్యం కూడా చేస్తోంది. కుమార్తె చేస్తున్న ఈ పనులు తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టం లేదు. 

ఈ రెండింటినీ విడిచిపెట్టాలని తల్లిదండ్రులు పలుమార్లు కుమార్తె సిద్రాను హెచ్చరించారు. ఇది మన సంప్రదాయం కాదని, బుద్ధిగా ఉండాలని నచ్చజెప్పారు. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఈద్‌ను జరుపుకునేందుకు గతవారం ఆమె ఫైసలాబాద్ నుంచి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో గురువారం తల్లిదండ్రులు, సోదరుడు హమ్జా మరోమారు ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అయినప్పటికీ ఆమె తన ప్రొఫెషన్‌ను వదులుకోవడానికి అంగీకరించలేదు. తాము ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన సోదరుడు హమ్జా నిన్న సోదరిని తుపాకితో కాల్చి చంపాడు.
 
హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు హమ్జాను అరెస్ట్ చేశారు. హత్య తానే చేసినట్టు హమ్జా పోలీసు విచారణలో అంగీకరించాడు. బంధువు ఒకరు తనకు ఫార్వార్డ్ చేసిన వీడియోలో సోదరి నృత్య ప్రదర్శనను చూసి హమ్జా కోపోద్రిక్తుడయ్యాడని, హత్యకు అదే కారణమని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఫైసలాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. 19 ఏళ్ల డ్యాన్సర్ అయేషాను ఆమె మాజీ భర్త కాల్చి చంపాడు. పరువు హత్యలు ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో సర్వసాధారణంగా మారిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

More Telugu News