Loudspeaker: లౌడ్ స్పీకర్లు ఈ రోజు వచ్చాయా..?: సంజయ్ రౌత్

  • లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ రాజ్ థాకరే అల్టిమేటం 
  • గత 50 ఏళ్లలో దీనిపై ఎందుకు మాట్లాడలేదన్న రౌత్ 
  • సోదరుడు సీఎంగా ఉన్నందునే ఈ రాద్ధాంతమని విమర్శ
Loudspeaker row Sena sanjay Raut slams Raj Thackeray Because his brother is CM

మసీదులపై లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే చేస్తున్న ఉద్యమంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి విమర్శలు చేశారు. ‘‘మసీదులపై లౌడ్ స్పీకర్ల విషయమై బాలా సాహెబ్ (బాల్ థాకరే) అభిప్రాయాలను తెలియజేసే పాత వీడియోలను షేర్ చేశారు. గడిచిన 50 ఏళ్ల కాలంలో విలాస్ రావ్ దేశ్ ముఖ్, పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తలేదు?

ఆ సమయంలో లౌడ్ స్పీకర్లు ఉన్నా ఆయనకు (రాజ్ థాకరే) ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ఆయనకు ఇది అంశంగా మారింది. ఎందుకంటే ఆయన సోదరుడు (ఉద్దవ్ థాకరే) మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు కనుకనే’’ అంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

మసీదులపై లౌడ్ స్పీకర్లలో పెద్ద శబ్దాలతో ప్రార్థనలు వినిపించడానికి తాము వ్యతిరేకమంటూ రాజ్ థాకరే స్పష్టం చేయడం తెలిసిందే. మే 3 నాటికి లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఆయన గడువు కూడా పెట్టారు. అయినా పట్టించుకోకపోవడంతో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ‘‘మసీదులపై లౌడ్ స్పీకర్లలో అజాన్ వినిపిస్తే.. ఆ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని పెట్టండి. అప్పుడు దానివల్ల కలిగే ఇబ్బంది ఏంటో వారికి అర్థమవుతుంది’’ అంటూ ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News