Virender Sehwag: ధోనీ స్థానంలో జడేజాను కెప్టెన్ చేయడం తప్పుడు నిర్ణయం: సెహ్వాగ్

  • తొలుత చెన్నై జట్టు పగ్గాలు జడేజాకి అప్పగింత
  • తాజా సీజన్ లో చెన్నైకి దారుణ ఓటములు
  • తాను కెప్టెన్సీ భారం మోయలేన్న జడేజా
  • మళ్లీ ధోనీకే నాయకత్వం అప్పగింత 
  • విమర్శనాత్మకంగా స్పందించిన సెహ్వాగ్
Sehwag opines on CSK captaincy issue

ఐపీఎల్ లో ఎంతో ఘనచరిత్ర కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో కెప్టెన్సీ మార్పు నిర్ణయం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. చెన్నై జట్టును ఐపీఎల్ లో నాలుగు సార్లు విజేతగా నిలిపిన ఎంఎస్ ధోనీ నుంచి ఈ సీజన్ లో రవీంద్ర జడేజా పగ్గాలు అందుకున్నాడు. అయితే వరుస పరాజయాలతో బెంబేలెత్తిపోయిన జడేజా... తనకు కెప్టెన్పీ వద్దంటూ తప్పుకోవడంతో మళ్లీ ధోనీయే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ పరిణామాలపై టీమిండియా మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

ధోనీ స్థానంలో జడేజాను కెప్టెన్ చేయడం ఓ తప్పుడు నిర్ణయం అని అభిప్రాయపడ్డాడు. "సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు తప్పటడుగు వేసింది. జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడమే ఆ తప్పు. కెప్టెన్ అయిన జడేజా మిగతా సీజన్ కు కూడా నాయకుడిగానే కొనసాగాల్సింది. కానీ అలా జరగలేదు" అని పేర్కొన్నాడు. 

అంతేకాదు, చెన్నై జట్టు కూర్పుపైనా సెహ్వాగ్ విమర్శలు చేశాడు. "ఇప్పటికీ చెన్నై జట్టులో సరైన కూర్పు లేదు. తుదిజట్టు ఏంటన్నది అనిశ్చితికరంగా మారింది. ఓపెనర్ గా వస్తున్న రుతురాజ్ గైక్వాడ్ శుభారంభాలు అందించడంలేదు. ఒక మ్యాచ్ లో ధోనీ కొన్ని పరుగులు చేస్తే, మరో మ్యాచ్ లో గైక్వాడ్ పరుగులు చేస్తున్నాడు తప్పితే... చెన్నై బ్యాటింగ్ లైనప్ లో సమష్టి కృషి లోపించింది.

ఇక ధోనీ ఆఖరి ఓవర్లో ఫోర్లతో విరుచుకుపడిన మ్యాచ్ లో కూడా చెన్నై జట్టు దాదాపు ఓటమి అంచుల్లో నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి చెన్నై బ్యాట్స్ మెన్ తీరు గాలికి కొట్టుకుపోయే గడ్డిపోచను తలపిస్తోంది. ఒకవేళ ఈ సీజన్ ఆరంభం నుంచే ధోనీ కెప్టెన్ గా ఉండుంటే చెన్నై ఇన్ని మ్యాచ్ ల్లో ఓడిపోయేది కాదు" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

More Telugu News