ఈమాత్రం పాటించినా చాలు.. ఆరోగ్యం మీ సొంతం..!

03-05-2022 Tue 11:16
  • 20-40 నిమిషాల పాటు శారీరక వ్యాయామం
  • నోటి శుభ్రతకు ఎంతో ప్రాధాన్యం
  • ఆహరంలో పోషకాలకు చోటు ఇవ్వాలి
  • సరిపడా నిద్రతో మంచి ఫలితాలు
  • మెరుగైన ఆరోగ్యానికి వైద్యుల సూచనలు
Doctors share tips you must follow to maintain a healthy lifestyle
ఆరోగ్యమే మహాభాగ్యం.. అనుభవంతో పెద్దలు చెప్పిన సూక్తి ఇది. పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర్నుంచి ఎన్నో పనులు చేస్తుంటాం. కానీ, అన్నింటికీ కీలకమైన ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి శ్రద్ద ఉండదు. ఇకనైనా ఈ విషయంలో మార్పు దిశగా అడుగులు వేయడం మంచిది. ఇందుకు వైద్యులు సూచిస్తున్న కొన్ని సూచనలు ఇవి..

శారీరక వ్యాయామం
తగినంత శారీరక వ్యాయామం చేయడంతోపాటు, పోషకాహారం తీసుకోవడం, సరిపడా నిద్రించడం.. ఈ మూడు ఆరోగ్యానికి మూడు మెట్లు అన్నది వైద్యుల సూచన. ఈ మూడింటిని ఆచరణలో పెడితే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చని చెబుతున్నారు. రోజువారీగా కనీసం 20 నిమిషాలు.. కుదిరితే 40 నిమిషాల వరకు శారీరకంగా శ్రమించాలి. వేగంతో కూడిన నడక లేదా పరుగు లేదా జిమ్ లో కసరత్తు అయినా కావచ్చు. 

మంచి నిద్ర
అతి నిద్ర మంచిదని అనుకోవద్దు. అలాగే, తక్కువ నిద్ర పోవడం కూడా మంచిది కాదు. సరిపడా నిద్ర, అది కూడా నాణ్యమైన నిద్ర ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశం అవుతుంది. మంచి గాఢ నిద్ర ఎప్పుడు పడుతుందంటే శారీరకంగా తగినంత శ్రమించినప్పుడే. మానసిక ఒత్తిళ్లను దూరంగా పెట్టినప్పుడే. మంచి నిద్ర వల్ల ప్రయోజనం ఏమిటంటే.. నిద్ర సమయంలో శరీరం తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. పునరుత్తేజం సంతరించుకుంటుంది. చిరాకు, అసహనం, అధిక రక్తపోటు సమస్యలను కూడా మంచి నిద్రతో దూరం పెట్టొచ్చని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. 

ఫోన్
ఆహారం తీసుకునే సమయంలో ఫోన్ చూడొద్దు. ఆహారాన్ని ఎప్పుడూ కూడా ఏకాగ్రతతో, ఇష్టంగా స్వీకరించాలని ఆయుర్వేదం చెబుతోంది. అప్పుడే తగినంత జీర్ణరసాలు విడుదలై చక్కగా అరిగిపోతుంది. పోషకాలు మంచిగా శరీరానికి అందుతాయి. టాయిలెట్లకు కూడా ఫోన్ తీసుకెళ్లొద్దు. ఏకాగ్రతతో చేయాల్సిన ఏ పని సమయంలో అయినా ఫోన్ ను దూరంగా పెట్టేయాలి.

నోటి ఆరోగ్యం
చాలా మంది ఏదైనా సమస్య అనిపిస్తే తప్ప నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ప్రతి రోజు పళ్ల మధ్య ఇరుక్కున్న వాటిని తొలగించుకోవడం చేయాలి. నిద్రించే ముందు పళ్లను బ్రష్ చేసుకోవడం అవసరం. నోటిలో ఎన్నో సూక్ష్మ జీవులు ఉంటాయి. నోటిని తగిన విధంగా శుభ్రం చేసుకోకపోతే గ్యాస్ట్రో సమస్యలు, గుండె జబ్బులకు దారితీస్తాయి. బ్రష్ చేసుకోకుండా నిద్రకు ఉపక్రమించొద్దని గుండె వైద్య నిపుణుల సూచన.

ఆహారం
ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. వరి అన్నం లేదా గోధుమ అన్నం లేదా చపాతీ అయినా అందులో కూర పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పైగా ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకుని, మధ్యాహ్నం లంచ్ తగినంత తీసుకుని, రాత్రి డిన్నర్  ను చాలా వరకు తగ్గించేయడం లేదా దూరం పెట్టడం మంచిదని, ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందని డాక్టర్ల సూచన.