Supreme Court: వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయలేం: సుప్రీంకోర్టు

  • టీకా వేయించుకోవాలని ఒత్తిడి చేయరాదన్న సుప్రీం 
  • ప్రస్తుత వ్యాక్సిన్ విధానం సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్య 
  • వ్యాక్సినేషన్ పాలసీ ఏకపక్షంగా ఉందని చెప్పలేమన్న కోర్టు 
We cant force anyone to take vaccine says supreme court

కరోనాను జయించడంలో, మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో కోవిడ్ వ్యాక్సిన్ పోషించిన పాత్ర చాలా కీలకమైనది. ఇప్పటి వరకు మన దేశంలో దాదాపు 190 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇప్పుడు మూడో డోసు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు సైతం వ్యాక్సిన్ వేస్తున్నారు. 

మరోవైపు వ్యాక్సినేషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒత్తిడి చేయలేమని, ఈ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత వ్యాక్సిన్ విధానం సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ పాలసీ ఏకపక్షంగా ఉందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. సమాజ హితం కోసం పాలసీ తయారు చేసి, అమలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. 

వ్యాక్సిన్ వేయించుకోలేదనే కారణంతో వ్యక్తులను పబ్లిక్ ప్రదేశాలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్గనైజేషన్లు అనుమతించడం లేదని... ఇది సరికాదని సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను అమలు చేయడాన్ని ఆపేయాలని ఆదేశించింది. 

కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ డాక్టర్ జాకోబ్ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం... వ్యాక్సిన్ కచ్చితంగా వేయించుకోవాలని ఆదేశించలేమని తీర్పును వెలువరించింది.

More Telugu News