కొత్త ఆసుపత్రిలో నర్సుపై గ్యాంగ్ రేప్.. బిల్డింగ్ పై నుంచి వేలాడదీసి హత్య.. డ్యూటీలో చేరి ఒక్కరోజే.. ఇదిగో వీడియో

01-05-2022 Sun 12:11
  • ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో దారుణం
  • గత నెల 25న న్యూ జీవన్ ఆసుపత్రి ఓపెన్
  • నలుగురు అనుమానితుల అరెస్ట్
Nurse Gang Raped and Murdered
జీవితంపై ఎన్నెన్నో ఆశలతో కొత్తగా కట్టిన ఆసుపత్రిలో నర్సుగా కెరీర్ ను ప్రారంభించింది ఆ యువతి. కానీ, ఒక్కరోజులోనే ఆమె కలలు, ఆశయాలన్నీ పటాపంచలయ్యాయి. కొందరు దుండగులు 19 ఏళ్ల ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి.. అతి కిరాతకంగా చంపేశారు. బిల్డింగ్ పై నుంచి వేలాడదీసి ఉరేసి ప్రాణం తీశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్  జిల్లా దుల్లాపూర్వ గ్రామంలో నిర్మించిన న్యూ జీవన్ ఆసుపత్రిలో నిన్న జరిగింది. 

శనివారం ఉదయం బిల్డింగ్ పైనుంచి వేలాడుతున్న నర్సు మృతదేహాన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయని నిర్ధారించారు. శుక్రవారం రాత్రి ఆమె నైట్ డ్యూటీ చేసిందని, ఆసుపత్రిలోనే నిద్రపోయిందని పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. 

అయితే, బాధితురాలి తల్లిదండ్రులు ఇది ముమ్మాటికీ గ్యాంగ్ రేపేనని, ఆ తర్వాత తన కూతురును చంపేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు సామూహిక అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న్యూ జీవన్ ఆసుపత్రిని ఏప్రిల్ 25న బంగార్మౌ ఎమ్మెల్యే శ్రీకాంత్ కటియార్ ప్రారంభించారు.