Andhra Pradesh: తల్లిపాత్ర సరిగా లేనప్పుడే అఘాయిత్యాలు: ఏపీ హోంమంత్రి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు

  • పనుల మీద తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు పిల్లలు ఒంటరిగా ఉండిపోతున్నారు
  • అది ఇతరులకు అవకాశంగా మారుతోంది
  • ఇలాంటి కేసుల్లో వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నాం
  • టీడీపీ హయాంలోనూ అత్యాచారాలు జరిగాయన్న మంత్రి వనిత
AP Home minister taneti Vanitha Controversial comments on Rape Cases

అమ్మాయిలపై అత్యాచారాల విషయంలో ఏపీ హోంమంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదేనని, ఆ పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాలు వంటివి జరుగుతుంటాయని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విశాఖపట్టణంలోని దిశ పోలీస్ స్టేషన్‌ను నిన్న సందర్శించిన వనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యతను తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఉద్యోగం కోసమో, కూలి పనుల కోసమో బయటకు వెళ్తుండడంతో పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతున్నారని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగుపొరుగువారు, బంధువులు, కొన్ని చోట్ల తండ్రులే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది చాలా బాధాకరమన్నారు. మహిళా పక్షపాతి అయిన తమ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఇలాంటి కేసుల్లో ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. తాళ్లపూడిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే మూడు రోజుల వరకు కేసు నమోదు చేయలేదు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఈ విషయంలో విచారణకు ఆదేశించామని, పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. టీడీపీ హయాంలోనూ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని, అయితే అప్పుడు వారు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం లేకపోవడం వల్లే కేసులు వెలుగులోకి రాలేదని మంత్రి అనిత వివరించారు.

More Telugu News