Tewatia: మళ్లీ వాళ్లిద్దరే బాదారు... బెంగళూరుకు ఘోర పరాజయం

  • రాణించిన తెవాటియా, మిల్లర్
  • బెంగళూరు బౌలింగ్ ను చితకబాదిన ద్వయం
  • 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విన్
RCB lost another match as Tewatia and Miller superb knocks

మొన్న సన్ రైజర్స్ కు ఓటమి రుచిచూపిన తెవాటియా, డేవిడ్ మిల్లర్ ఇవాళ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి దూకుడుతో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్లతో ఘనవిజయం సాధించగా... పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవిచూసింది. బెంగళూరు విసిరిన 171 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి, మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

గుజరాత్ విజయంలో తెవాటియా, మిల్లర్ లదే కీలకపాత్ర. తెవాటియా 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేయగా, మిల్లర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 39 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. 

అంతకుముందు, ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా 29, శుభ్ మాన్ గిల్ 31 పరుగులు చేసి శుభారంభం అందించారు. వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ 20 పరుగులు చేయగా, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే, హేజెల్ వుడ్, సిరాజ్, హసరంగలతో కూడిన బెంగళూరు బౌలింగ్ దళం ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమైంది. దానికితోడు ఫీల్డింగ్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆర్సీబీ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 2, హసరంగ 2 వికెట్లు తీశారు.

టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్


ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయి డీవై పాటిల్ మైదానం వేదిక కాగా, టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. డివాల్డ్ బ్రెవిస్, జయదేవ్ ఉనద్కత్ ల స్థానంలో టిమ్ డేవిడ్, కుమార్ కార్తికేయ జట్టులోకి వచ్చారని తెలిపాడు. ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు సారథి సంజు శాంసన్ చెప్పాడు. ఇప్పటివరకు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ముంబయి ఇండియన్స్ ఇవాళ్టి మ్యాచ్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

More Telugu News