Edible oil: రానున్న నెలల్లో వంటనూనెల ధరల మంటలు?

  • రెండంకెల స్థాయిలో పెరగొచ్చు
  • ఆగని రష్యా - ఉక్రెయిన్ యుద్ధం
  • పామాయిల్  ఎగుమతులను నిషేధించిన ఇండోనేషియా
  • ఇతర వంట నూనెలకు పెరిగిన డిమాండ్
  • ఇండియా రేటింగ్స్ అంచనాలు
Edible oil prices likely to rise in next few months

వంటింట్లో నూనెతో ఏది చేయాలన్నా? ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాది క్రితం వరకు రూ.100 స్థాయిలో ఉన్న వంట నూనెల ధరలు రూ.200కు చేరాయి. కొంత కాలం ఓపిక పడితే మళ్లీ ధరలు దిగొస్తాయిలే అనుకుంటూ పొదుపుగా వంటనూనెను వాడుతూ రోజులు నెట్టుకొస్తున్న వారికి ఇది మింగుడు పడని విషయమే. వచ్చే కొన్ని నెలల్లో వంట నూనెల ధరలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


ఉక్రెయిన్ - రష్యా యుద్ధం రెండు నెలలు దాటినా కొనసాగుతూనే ఉండడం.. పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడం ప్రతికూలతలుగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్ కు ప్రతీ నెలా 2 మిలియన్ టన్నుల మేర పామాయిల్ సరఫరా నిలిచిపోతుందని తెలిపింది. నెలవారీ ట్రేడయ్యే పరిమాణంలో ఇది 50 శాతానికి సమానమని పేర్కొంది. దీంతో ఇతర నూనెలకు డిమాండ్ పెరుగుతుందని..  ఫలితంగా అధిక ధరలకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. 

ఇండోనేషియా నిర్ణయంతో భారత్ కు పామాయిల్ సరఫరా సగం మేర ప్రభావితమవుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణానికీ దారితీస్తుందని తెలిపింది. రూపాయి విలువ తగ్గుతుండడం, అదే సమయంలో దిగుమతులు పెరుగుతుండడంతో వాటి ధరలు పెరిగేందుకు దారితీస్తుందని వివరించింది. 2022 జనవరిలో ఉన్న నూనెల ధరలతో పోలిస్తే సమీప భవిష్యత్తులో రెండంకెల స్థాయిలో పెరుగుదల ఉండొచ్చని పేర్కొంది.

More Telugu News