China: భారత విద్యార్థుల్లో కొందరికే అనుమతి: చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడి

  • చైనాలో 2019 డిసెంబరులో కరోనా వ్యాప్తి మొదలు
  • స్వదేశానికి చేరుకున్న భారత విద్యార్థులు
  • అప్పటి నుంచి చైనాలో కఠిన ఆంక్షలు
  • భారత్ లోనే విద్యార్థులు
China says they can receive some Indian students till now

కరోనా సంక్షోభం అనంతరం చైనాలో విద్యాసంస్థలు తెరుచుకోగా, అక్కడి యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారత విద్యార్థులు తిరిగి వెళ్లేందుకు తీవ్ర ఆంక్షలు ఎదురవుతున్నాయి. దాంతో చైనా ప్రభుత్వ తీరుపై భారత విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా దౌత్య మార్గాల్లో ఈ అంశాన్ని చైనా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. 

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ, భారత విద్యార్థులు తిరిగి వచ్చే ప్రక్రియకు చైనా అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. చైనాకు విద్యార్థులు తిరిగి వచ్చే విధివిధానాలను, ఇతర దేశాల విద్యార్థులు చైనాకు వస్తున్న పద్ధతులను భారత వర్గాలతో పంచుకున్నామని వెల్లడించారు. 

"వాస్తవానికి భారత విద్యార్థులు చైనాకు తిరిగి వచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అయితే, చైనాకు రాదలుచుకున్న విద్యార్థుల జాబితాను భారత్ మాకు ఇవ్వడమే మిగిలుంది. భారత్ కు చెందిన వారు పెద్ద సంఖ్యలో చైనాకు రావాలనుకుంటున్న విషయం మాకు అర్థమైంది. వారందరి పేర్లు సేకరించేందుకు భారత్ కు కొంత సమయం పడుతుందని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో, కొందరు భారత విద్యార్థులను అనుమతించేందుకు చైనా సిద్ధంగా ఉంది" అని ఝావో లిజియాన్ తెలిపారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా వీసా అంక్షలు, విమాన ప్రయాణాలు మరింత కఠినతరం చేసింది. దాంతో చైనా యూనివర్సిటీల్లో చదువుతున్న భారత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు రెండేళ్ల పాటు భారత్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చైనాలో దాదాపు 23 వేల మంది వరకు భారత విద్యార్థులు చదువుతున్నారు. వారిలో అత్యధికులు చైనా విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. చైనాలో 2019 డిసెంబరులో కరోనా వ్యాప్తి మొదలయ్యాక వారందరూ భారత్ కు వచ్చేశారు. అయితే డ్రాగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షల కారణంగా వారు తిరిగి చైనా వెళ్లలేకపోయారు.

More Telugu News