Sadhvi Ritambhara: హిందూ దేశం కోసం నలుగురిని కనండి.. ఇద్దరిని దేశానికి అంకితమివ్వండి: సాధ్వి రితంబర

Sadhvi Ritambhara urges hindus to produce 4 children
  • మనమిద్దరం.. మనకిద్దరు నినాదాన్ని వీడండన్న సాధ్వి  
  • హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారి భరతం పడతానని వ్యాఖ్య 
  • నా జాతి ప్రయోజనాలే ముఖ్యమనేది హిందూ జాతి మంత్రం కావాలన్న రితంబర
హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలంటూ వస్తున్న పిలుపులు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. దేశం ఇస్లామిక్ కంట్రీగా మారకూడదంటే హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని వివాదాస్పద స్వామీజీ యతి నర్సింగానంద్ గతంలో ఒకసారి పిలుపునివ్వగా, ఆయన ఆధ్వర్యంలోని సంస్థ నిన్న మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేసింది. 

తాజాగా, హిందుత్వ నేత, దుర్గా వాహిని వ్యవస్థాపకురాలు సాధ్వి రితంబర కూడా ఇలాంటి పిలుపే ఇచ్చారు. హిందూ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలని, వారిలో ఇద్దరిని దేశానికి అంకితమివ్వాలని కోరారు. అలా చేస్తేనే దేశం హిందుత్వ రాజ్యమవుతుందన్నారు. లక్నోలోని నీరాల నగర్‌లో నిర్వహించిన రామ మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, ఆరెస్సెస్ నేతలతోపాటు పలువురు సాధువులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రితంబర మాట్లాడుతూ.. రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. మనం ఇద్దరం, మనకు ఇద్దరు విధానాన్ని అనుసరించకూడదని అన్నారు. హిందూ సమాజంలోని సోదరులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని కోరారు. 

ఇక ఆ నలుగురిలో ఇద్దరిని ఆరెస్సెస్‌కు అప్పగిస్తే ఆరెస్సెస్ వలంటీర్ అవుతారు, భజరంగ్‌దళ్‌ బజరంగ్ దేవ్ అవుతాడు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్త అవుతాడు అన్నారు. మీ నుదిటిపై భరత ధూళిని పూయడం ద్వారా మీ జన్మ ధన్యమవుతుంది అని ఆమె అన్నారు. నా దేశం ప్రధానమని, నా జాతి ప్రయోజనాలే ముఖ్యమనేది హిందూ జాతి మంత్రం కావాలని అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి 6 వేల మంది చిన్నారులు శ్రీరాముడి వేషధారణలో వచ్చారు.
Sadhvi Ritambhara
Hindu
Children
Hindu Nation

More Telugu News