Aaditya Thackeray: చిన్నాన్న రాజ్ థాకరేకి కౌంటర్ ఇచ్చిన ఆదిత్య థాకరే!

  • మసీదుల్లో మే 3లోగా లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ రాజ్ థాకరే హెచ్చరిక
  • లేకపోతే మసీదుల వద్ద హనుమాన్ చాలీసా వినిపిస్తామని సవాల్
  • లౌడ్ స్పీకర్ల గురించి కాకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై మాట్లాడితే బాగుంటుందన్న ఆదిత్య
Aaditya Thackeray gives counter to Raj Thackeray

తన చిన్నాన్న, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే సైటెర్లు వేశారు. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను తొలగించడానికి మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి (సంకీర్ణ ప్రభుత్వం) మే 3 వరకు గడువిస్తున్నానని... ఈలోగా వాటిని తొలగించకపోతే ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసాను వినిపిస్తారని రాజ్ థాకరే ఇటీవల హెచ్చరించారు. 

తాము విసిరిన సవాల్ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని... ఏం చేసుకుంటారో చేసుకోండని శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి రాజ్ థాకరే ఛాలెంజ్ చేశారు. లౌడ్ స్పీకర్లు వాడటమనేది మతపరమైన సమస్య కాదని, సామాజిక సమస్య అని అన్నారు. 

ఇదే సమయంలో ప్రధాని మోదీకి కూడా రాజ్ ఒక విన్నపం చేశారు. ముంబైలోని ముస్లిం ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలపై రెయిడ్ చేయాలని కోరారు. అక్కడ నివసిస్తున్న వారంతా పాకిస్థాన్ మద్దతుదారులేనని ఆరోపించారు. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతోందనేది ముంబై పోలీసులకు తెలుసని అన్నారు. వారిని మన ఎమ్మెల్యేలు ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారని చెప్పారు. వారికి ఆధార్ కార్డులు లేకపోయినా... ఎమ్మెల్యేలు వాటిని తయారు చేయించి ఇస్తున్నారని మండిపడ్డారు. 

రాజ్ థాకరే వ్యాఖ్యలపై ఆదిత్య థాకరే స్పందిస్తూ... లౌడ్ స్పీకర్లను తొలగించే అంశంపై మాట్లాడుతున్న వారు... దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై మాట్లాడితే బాగుంటుందని సెటైర్ వేశారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలపై మాట్లాడితే బాగుంటుందని అన్నారు. గత రెండు, మూడేళ్లలో ఏం జరిగిందనే విషయంపై మనం మాట్లాడుకుందామని వ్యాఖ్యానించారు.

More Telugu News