S400: ఒకవైపు యుద్ధం.. మరోవైపు రష్యా నుంచి భారత్ కు కీలక రక్షణ వ్యవస్థల సరఫరా!

  • రెండో విడత ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ  
  • విడిభాగాలు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లు సరఫరా
  • భవిష్యత్తు సరఫరాలపై అనిశ్చితి
  • చెల్లింపులు ఎలా చేయాలన్నదే సమస్య
India Receives S400 Overhauled Engines Spares From Russia

రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుండడం, రష్యాపై అమెరికా సహా ప్రపంచ దేశాల ఆంక్షలతో.. ఆ దేశం నుంచి భారత్ కు కీలక ఆయుధాల సరఫరా నిలిచిపోతుందేమోనన్న ఆందోళనకు తెరపడింది. చెప్పినట్టుగానే క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను భారత్ కు రష్యా సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఒక విడత సరఫరా చేయగా.. తాజాగా రెండో విడత క్షిపణి రక్షణ వ్యవస్థ, శిక్షణ పరికరాలను పంపించింది. సిమ్యులేటర్లు, ఎస్-400 శిక్షణకు సంబంధించి ఎక్విప్ మెంట్ భారత్ కు అందాయి. 

తొలి విడతలో అందిన ఎస్-400 రక్షణ వ్యవస్థలను పాక్, చైనా సరిహద్దుల్లో మన దేశం మోహరించింది. తమ దేశంపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆయుధాల సరఫరా ఆగదంటూ ఇటీవలే భారత్ కు వచ్చిన సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ హామీ కూడా ఇచ్చారు. శత్రుదేశం మనపైకి క్షిపణులను ప్రయోగిస్తే అవి మన భూభాగాన్ని తాకకముందే గాలిలోనే తునాతునకలు చేసేదే ఎస్-400. 2018 అక్టోబర్ లో వీటి సరఫరా కోసం భారత్ రూ.38,000 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఇంత భారీ ఒప్పందం అమెరికాకు మింగుడు పడడం లేదు. దీనికి దూరంగా ఉండాలంటూ ఎప్పటి నుంచో ఇండియాను బెదిరిస్తోంది. అయినా భారత్ తలొగ్గలేదు. 

మరమ్మతులు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లు, విడిభాగాలు కూడా భారత్ కు సరఫరా అయిన వాటిల్లో ఉన్నాయి. తాజాగా రష్యా నుంచి ఆయుధ, రక్షణ పరికరాలు అందాయని, భవిష్యత్తులో వీటి సరఫరాపై మాత్రం అనిశ్చితి నెలకొన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రష్యాపై ఆంక్షలతో చెల్లింపులు ఎలా చేయాలన్న దానిపై ఇరు దేశాలు పరిష్కారం కనుగొనాల్సి ఉంది. 

More Telugu News