Telangana: 10 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి కేసీఆర్.. లఖింపూర్ ఖేరీ బాధిత కుటుంబాల పరామర్శ

CM KCR to visit Delhi and stay there for 10 days
  • బీజేపీపై పోరు తప్పదని ఇది వరకే ప్రకటించిన కేసీఆర్
  • వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి 
  • పలువురు మేధావులు, ఆర్థికవేత్తలు, రైతు నేతలతో సమావేశం
  • ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌నూ కలిసే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈసారి 10 రోజులపాటు హస్తినలోనే మకాం వేయనున్నారు. బీజేపీపై యుద్ధం తప్పదని ఇది వరకే ప్రకటించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా లఖింపూర్ ఖేరీ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు వాహనంతో దూసుకెళ్లడంతో పలువురు రైతులు, జర్నలిస్టు మరణించగా, మరికొందరు రైతులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

పంటి నొప్పితో బాధపడుతున్న కేసీఆర్ ఈ నెల 3న ఢిల్లీ వెళ్లి ఆసుపత్రిలో చూపించుకున్నారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న టీఆర్ఎస్ నిర్వహించిన దీక్షలోనూ కేసీఆర్ పాల్గొన్నారు. తాను మరోమారు ఢిల్లీ రానున్నట్టు సీఎం అప్పుడే ప్రకటించారు. 

ఈసారి పర్యటన సందర్భంగా పలువురు ఆర్థికవేత్తలు, రైతుల సంఘాల ప్రతినిధులను కలిసే అవకాశం ఉంది. దేశ రైతాంగం కోసం ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ అవసరమని ఇటీవల పేర్కొన్న కేసీఆర్ ఈ విషయమై వారితో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం మహారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌నూ కలుస్తారు. ఆ తర్వాత పూణెలో కొందరు మేధావులు, నేతలతోనూ కేసీఆర్ సమావేశమవుతారని తెలుస్తోంది.
Telangana
KCR
TRS
New Delhi
BJP
Lakhimpur Kheri

More Telugu News