Kakani Govardhan Reddy: నెల్లూరు కోర్టులో చోరీ.. మంత్రి కాకాణిపై సోమిరెడ్డి పెట్టిన కేసు పత్రాల అపహరణ

Theft in Nellore court and files of a case against minister kakani missing
  • సీజ్ చేసిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దుండగులు
  • కాకాణిపై సోమిరెడ్డి పెట్టిన ఫోర్జరీ కేసు పత్రాలను కోర్టు ప్రాంగణంలో పారేసిన వైనం
  • ఈ కేసులో ఏ-1 నిందితుడిగా కాకాణి
నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో మొన్న రాత్రి జరిగిన చోరీ తీవ్ర చర్చనీయాంశమైంది. సీజ్ చేసిన నాలుగు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వాటిలో కొన్ని డాక్యుమెంట్లు ఉండగా వాటిని కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. పోలీసులు ఆ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా వాటిని గుర్తించారు. 

సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని 2017లో కాకాణి ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని రుజువులను కూడా బయటపెట్టారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి.. నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా కాకాణి బయటపెట్టినవి నకిలీ పత్రాలుగా గుర్తించి చార్జిషీటు దాఖలు చేశారు. అందులో కాకాణిని ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే, ఆ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్‌ను ఏ-2గా పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ కేసు నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కోర్టులోకి చొరబడిన దొంగలు ఆ కేసుకు సంబంధించి భద్రపరిచిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ చోరీ తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు ప్రాంగణంలో పడేసిన పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kakani Govardhan Reddy
Somireddy Chandra Mohan Reddy
TDP
YSRCP
Nellore Court

More Telugu News