Andhra Pradesh: కార్మికుల రక్షణపై రాజీ పడరాదు.. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై చంద్రబాబు

CBN Responds On Porus Chemical Factory Accident
  • పలువురి మృతిపై బాబు విచారం
  • గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి
  • ప్రమాద కారకులపై కఠిన చర్యలకు డిమాండ్
  • ఫ్యాక్టరీల్లో భద్రతను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న అచ్చెన్నాయుడు
ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంలో పలువురు చనిపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి.. వారి ప్రాణాలను కాపాడాలని కోరారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ పట్ల సంస్థలు రాజీ పడరాదని ఆయన సూచించారు. 

ప్రభుత్వం కూడా నిత్యం తనిఖీలు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని హితవు చెప్పారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. 

మరోపక్క, పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఫ్యాక్టరీలు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా? లేదా? అనే విషయంపై పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చినట్టే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకూ పరిహారం అందించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Crime News
Chandrababu
Atchannaidu
Telugudesam

More Telugu News