AP Cabinet: సినీ రంగంపై ఏపీ కొత్త మంత్రి మాట ఇదే!

new cinematography minister comments on cine industry
  • సినిమాటోగ్ర‌ఫీ శాఖ చెల్లుబోయిన‌కు కేటాయింపు
  • గ‌తంలో తాజా మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వ‌ర్యంలో సాగిన శాఖ‌
  • సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తామ‌న్న కొత్త మంత్రి
  • ఏపీలో షూటింగ్‌లు జ‌రుపుకోవాలంటూ సినీ పెద్ద‌ల‌కు విన‌తి
ఏపీలో సినీ రంగానికి చెందిన స‌మ‌స్య‌ల‌పై మొన్న‌టిదాకా సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి హోదాలో పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని) మాట్లాడేవారు. ఇప్పుడు ఆయ‌న తాజా మాజీ మంత్రి అయిపోయారు. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఆయ‌న మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. గ‌త మంత్రివ‌ర్గంలో ఆయ‌న స‌హ‌చ‌ర మంత్రిగా సాగిన చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మాత్రం మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో త‌న మంత్రి ప‌ద‌విని నిల‌బెట్టుకున్నారు. పైపెచ్చు పేర్ని నాని నిర్వహించిన సినిమాటోగ్ర‌ఫీ, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌ను కూడా వేణుగోపాల‌కృష్ణ ద‌క్కించుకున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం మంత్రిగా ప్ర‌మాణం చేసిన చెల్లుబోయిన సినిమా రంగానికి సంబంధించి కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

సినీ పరిశ్రమ ఇబ్బందులు తొలగాలనేది సీఎం లక్ష్యమ‌ని చెప్పిన వేణుగోపాల‌కృష్ణ‌..  ఆ దిశగా అడుగులు వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఉన్న ప్రకృతి అందాలు, షూటింగ్ స్పాట్లను సినిమా పరిశ్రమ ఉపయోగించుకోవాలని ఆయ‌న కోరారు. వెర‌సి సినీ ప‌రిశ్ర‌మ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని చెబుతూనే.. సినిమా షూటింగ్‌ల‌ను ఏపీలోనూ జ‌ర‌పాలంటూ ఆయ‌న సినీ పెద్ద‌ల‌కు సూచించారు.
AP Cabinet
Chelluboina Venugopalakrishna
Cinematography
Andhra Pradesh
YSRCP

More Telugu News